ప్రతి ఆశా కార్యకర్త రోజుకు 10 మందికి స్క్రీనింగ్ చేయాలి: డీఎంహెచ్ఓ డాక్టర్ రాజశ్రీ
నిజామాబాద్, సెప్టెంబర్ 3: (E6tv NEWS: శివ ఠాకూర్).
జీవనశైలి వ్యాధులైన హైపర్‌టెన్షన్, మధుమేహం, క్యాన్సర్ తదితర వ్యాధులను తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి. రాజశ్రీ సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జీవనశైలి వ్యాధులపై ఓరియంటేషన్ శిక్షణ, సమీక్ష కార్యక్రమం నిర్వహించారు. డబ్ల్యూహెచ్ఓ కన్సల్టెంట్ డాక్టర్ అబ్దుల్ వాసి ముఖ్యఅతిథిగా హాజరై వైద్యాధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ అబ్దుల్ వాసి మాట్లాడుతూ 30 సంవత్సరాలు పైబడిన ప్రతి ఒక్కరికీ జీవనశైలి వ్యాధుల నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. గ్రామాలు, ఉపకేంద్రాల వారీగా ప్రతి ఆశా కార్యకర్త రోజుకు కనీసం 10 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తే జిల్లాలో పెండింగ్‌లో ఉన్న స్క్రీనింగ్‌ను ఈ నెలాఖరులోగా పూర్తి చేయవచ్చని తెలిపారు. 30 ఏళ్లు పైబడిన వారిలో గుండెజబ్బులకు సంబంధించిన రిస్క్ అధికంగా ఉన్నవారితో పాటు మధుమేహ బాధితులను గుర్తించి, వారికి సకాలంలో చికిత్స ప్రారంభించాలన్నారు.ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పాజిటివ్ కేసుల వివరాలను కూడా ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. ఇంకా ABHA కార్డులకు నమోదు కాని వారందరినీ 100 శాతం నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి నెల 5వ తేదీలోగా సంబంధిత ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాల స్థాయిలో అవసరమైన వివరాలను ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు.హైపర్‌టెన్షన్, డయాబెటిస్ చికిత్సా విధానాలపై వివిధ పీహెచ్‌సీల వైద్యాధికారులకు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.
మాతా శిశు ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి
డీఎంహెచ్ఓ డాక్టర్ బి. రాజశ్రీ మాట్లాడుతూ జీవనశైలి వ్యాధులతో పాటు ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను కూడా సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. మాతా శిశు ఆరోగ్య సేవలను విస్తృతం చేయడంతో పాటు క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరాలను నిర్వహించి కొత్తగా గుర్తించిన కేసులకు వెంటనే చికిత్స అందించాలన్నారు.వివిధ శాఖల సమన్వయంతో, మండల స్థాయి ప్రత్యేక అధికారుల సహకారంతో టీబీ ఎంబీఏ కార్యక్రమాన్ని ప్రతి పీహెచ్సీ స్థాయిలో పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. క్షయ వ్యాధిగ్రస్తులకు పోషణ కిట్లు అందించడంతో పాటు పోషకాహారం కోసం ప్రభుత్వం అందించే నెలకు రూ.1,000 డీబీటీని 100 శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.పీహెచ్‌సీల్లో అవసరమైన, పంపిణీ చేసిన ఔషధాల వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలని, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని 100 శాతం పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన 14 ఏళ్ల బాలికలందరికీ హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.


ఈ కార్యక్రమంలో డీఐఓ డాక్టర్ అశోక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ సికందర్ నాయక్, పీవో ఎన్సీడీ డాక్టర్ వెంకన్న, డాక్టర్ నవ్య, ఎన్సీడీ కోఆర్డినేటర్ వెంకటేష్, డీహెచ్ఈ ఘనపూర్ వెంకటేశ్వర్లు, డీడీఎం నారాయణ, డీపీఓ విశాల తదితరులతో పాటు వివిధ పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.

