నిధులు విడుదల చేయకపోతే మహాధర్నా, రోడ్డు బంద్ హెచ్చరిక
భూభారతి విధానంలో పేదలకు అన్యాయం జరుగుతోందని ఆందోళన
నిజామాబాద్, ఆగస్టు 6: (E6 tv NEWS ప్రతినిధి)
ఎస్టీ కార్పొరేషన్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం (AIBSS) డిమాండ్ చేసింది. గురువారం నిజామాబాద్‌లోని రోడ్డు రవాణా భవనాల అతిథి గృహంలో జిల్లా యువజన అధ్యక్షులు మూడ్ ఇందల్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రామావత్ మోహన్ నాయక్ మాట్లాడుతూ, గత ఆరు సంవత్సరాలుగా ఎస్టీ కార్పొరేషన్ నిధులు విడుదల కాకపోవడంతో బంజారా వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేయాలని, లేకపోతే ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో మహాధర్నా, రోడ్డు బంద్ వంటి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎస్సీ వర్గానికి సబ్సిడీ నిధులు విడుదల చేసిన తరహాలోనే ఎస్టీ వర్గానికీ సమానంగా నిధులు విడుదల చేయాలని వారు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం బంజారా వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తోందని, ఎస్టీ మంత్రిని నియమించకపోవడం ఇందుకు నిదర్శనమని విమర్శించారు.
ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి విధానంలో అసైన్‌మెంట్, ప్రభుత్వ భూములను ఆన్‌లైన్ చేయకపోవడంతో పేద ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందలేకపోతున్నారని నాయకులు పేర్కొన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.
సమావేశంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కోర్ర గంగాధర్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జిల్లా, డివిజన్, పట్టణ స్థాయి సంఘం నాయకులు, యువజన ప్రతినిధులు, కార్యవర్గ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.


