విద్యార్థుల భద్రత దృష్ట్యా ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటింపు
అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరిక
వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలని సూచన
నిర్మల్, జూలై 30: E6 tv NEWS (Md, అమీనుద్దీన్).
నిర్మల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లా కలెక్టర్ నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలకు సెలవు ప్రకటించారు.
జిల్లాలో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో పాటు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.ప్రజలు అత్యవసర పరిస్థితులు మినహా ఇళ్ల నుంచి బయటకు రావద్దని జిల్లా యంత్రాంగం సూచించింది. ముఖ్యంగా వాగులు, వంకలు, చెరువులు, లోతట్టు ప్రాంతాల సమీపంలోకి వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
వాతావరణ పరిస్థితులను జిల్లా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోందని, అవసరమైతే మరిన్ని ముందస్తు చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు. ప్రజలు అధికారిక వాతావరణ హెచ్చరికలను అనుసరిస్తూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

