డ్రైవర్ మృతి.. 12 మందికి గాయాలు
బిచ్కుంద ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు
బిచ్కుంద, సెప్టెంబర్ 4:(E6tv NEWS: ప్రతినిధి)
జుక్కల్ చౌరస్తా వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా, మరో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. మొత్తం 13 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే జుక్కల్ ఎమ్మెల్యే శ్రీ తోట లక్ష్మీకాంతారావు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఎమ్మెల్యే పరామర్శించి, వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారిలో ఒకరికి తలకు తీవ్ర గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన క్షతగాత్రులకు బిచ్కుంద ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు.క్షతగాత్రులకు అవసరమైన మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు వైద్యాధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని, అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.ప్రమాద ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తూ, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.




