Breaking News

నందిపేట ప్రయాణికుల నరకయాతన కథనం నిరాధారం: టీజీఎస్ఆర్టీసీ

నిజామాబాద్, ఆగస్టు 20: (E6tv NEWS: ప్రతినిధి)

నందిపేట ప్రయాణికుల ఇబ్బందులపై ఇటీవల ఓ పత్రికలో ప్రచురితమైన “నందిపేట ప్రయాణికుల నరకయాతన” కథనం పూర్తిగా నిరాధారమని టీజీఎస్ఆర్టీసీ నిజామాబాద్-1 డిపో మేనేజర్ స్పష్టం చేశారు. ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపారు.నిజామాబాద్–నందిపేట మార్గంలో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా బస్సు సర్వీసులను సమర్థవంతంగా నడుపుతున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం నిజామాబాద్-1 డిపో నుంచి నందిపేట మధ్య 5 పల్లెవెలుగు, 4 ఎక్స్‌ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని తెలిపారు. వీటిని సుమారు 15 నిమిషాల ఫ్రీక్వెన్సీతో అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు.

అదేవిధంగా నందిపేట దాటి పరిసర గ్రామాలకు వెళ్లే ప్రయాణికుల కోసం మరో 2 పల్లెవెలుగు సర్వీసులను నందిపేట మీదుగా నడుపుతున్నట్లు తెలిపారు. ఈ మార్గంలో రోజుకు సుమారు 66 ట్రిప్పులు నిర్వహిస్తూ నిరంతర రవాణా సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పారు.ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల రాకపోకలను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని, సర్వీసులు నిర్ణీత సమయానికి, సమానమైన ఫ్రీక్వెన్సీతో నడిచేలా చర్యలు తీసుకుంటున్నామని డిపో మేనేజర్ తెలిపారు.

ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిజామాబాద్–నందిపేట మధ్య బస్సు సర్వీసులను మరింత సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన, సమయపాలనతో కూడిన రవాణా సేవలు అందించడమే టీజీఎస్ఆర్టీసీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.భవిష్యత్‌లో ప్రయాణికుల అవసరాలు, రద్దీకి అనుగుణంగా సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటామని నిజామాబాద్-1 డిపో మేనేజర్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *