Breaking News

పేదలకు భూమి పంపిణీ చేయాలి: కల్వకుంట్ల కవిత

సామాజిక న్యాయం కోసం మరోసారి భూ పంపిణీ అవసరం

అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకంతో ప్రతి కుటుంబానికి ఎకరం భూమి: కవిత

బంజారాహిల్స్, ఆగస్టు 18: (E6tv NEWS: ప్రతినిధి).

రాష్ట్రంలో నిజమైన సామాజిక న్యాయం జరగాలంటే మరోసారి భూ పంపిణీ చేపట్టాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత అన్నారు. పేదలకు భూమి పంపిణీ చేయాలన్న డిమాండ్‌తో పాటు, తాము అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఎకరం భూమి పంపిణీ చేస్తామని ప్రకటించారు.సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ నిర్వహించిన తర్వాతే ముఖ్యమంత్రి సామాజిక న్యాయం గురించి మాట్లాడటం ప్రారంభించారని కవిత అన్నారు. తమ ఒత్తిడి కారణంగానే ప్రభుత్వం సామాజిక న్యాయం అనే అంశంపై మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి మాటల్లో సామాజిక న్యాయం చెబుతూ, చేతల్లో సామాజిక అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

మంత్రివర్గంలో బీసీలకు తగిన ప్రాతినిధ్యం లేదని కవిత ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సముచిత అవకాశాలు కల్పించకుండా సామాజిక న్యాయం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మహిళలకు, బీసీలకు, మైనార్టీలకు పదవుల కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందని విమర్శించారు.ప్రభుత్వం తీసుకుంటున్న భూ విధానాలపై కూడా కవిత తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పేదల భూములను పరిశ్రమలు, అభివృద్ధి పేరుతో లాక్కుంటే ఊరుకునేది లేదని, వారి తరఫున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ధరణి, భూ భారతి చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారని, 22ఏ నిబంధనను భూముల విషయంలో దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని ఆరోపించారు.రాష్ట్రంలో పేదలకు గతంలో కేటాయించిన భూములను తిరిగి లాక్కుంటున్నారని కవిత ఆరోపించారు. అసైన్డ్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల పేరుతో పేదల భూములను స్వాధీనం చేసుకోవడం ఆపాలని కోరారు.

రాష్ట్రంలో భూమి ఉన్నవారికి సమాజంలో గౌరవం, భద్రత వేరుగా ఉంటాయని కవిత అన్నారు. ఆదివాసీలు, పేదలు, మధ్యతరగతి ప్రజలకు భూమి పంచప్రాణం లాంటిదని పేర్కొన్నారు. అందువల్ల సామాజిక న్యాయం సాధించాలంటే పేదలకు భూమి ఉండాల్సిందేనన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ‘భూ లక్ష్మి’ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి ఎకరం భూమి ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న భూములు, భూదాన్ భూములు తదితర భూములపై సమగ్ర లెక్కలు తీసి, అర్హులైన పేదలకు భూమి పంపిణీ చేసే అవకాశం ఉందని కవిత పేర్కొన్నారు.రాష్ట్రంలో జరుగుతున్న భూదోపిడీపై మేధావులు, ప్రజలు కలిసి పోరాటం చేయాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ విధంగా ఉద్యమించామో, అదే విధంగా సామాజిక న్యాయం కోసం కూడా పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

“సామాజిక న్యాయం మాటల్లో కాదు.. చేతల్లో కనిపించాలి. పేదల భూములను లాక్కుంటే ఊరుకునేది లేదు. వారి తరఫున పోరాడుతాం. సామాజిక న్యాయం జరగాలంటే భూ పునఃపంపిణీ జరగాల్సిందే” అని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *