Breaking News

ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

నిజామాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS:శివ ఠాకూర్)

నిజామాబాద్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రెస్ క్లబ్ ఆవరణలో అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు.

ఈ సందర్భంగా స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్టుల క్రీడా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఐశ్వర్యం హోమ్స్ అండ్ బిల్డర్స్ ఆధ్వర్యంలో, మంతం మధు సహకారంతో నిర్వహించిన క్రికెట్, షటిల్, క్యారం పోటీల్లో ప్రతిభ కనబరిచిన జర్నలిస్టులకు మంతం మధు చేతుల మీదుగా బహుమతులు అందించారు.

ఈ సందర్భంగా మంతం మధు మాట్లాడుతూ.. నిత్యం విధి నిర్వహణలో ఒత్తిడికి లోనయ్యే జర్నలిస్టులకు క్రీడా పోటీలు మానసిక ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయని అన్నారు. జర్నలిస్టుల సంక్షేమం, కార్యక్రమాలకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ అందిస్తామని తెలిపారు.

వేగం కంటే వాస్తవం ముఖ్యం

ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పంచారెడ్డి శ్రీకాంత్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కేవలం జెండా ఎగురవేయడం మాత్రమే కాకుండా దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. గాంధీజీ, నెహ్రూ, సర్దార్ పటేల్, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, కొమురం భీం వంటి మహనీయుల త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని పేర్కొన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలతో పాటు పత్రికా రంగం నాలుగో స్తంభంగా కీలక పాత్ర పోషిస్తోందన్నారు. తెలంగాణ ఉద్యమాల చరిత్రలో నిజామాబాద్ గడ్డకు ప్రత్యేక స్థానం ఉందని, తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు ఈ ప్రాంతం నుంచి జర్నలిస్టులు రాసిన ప్రతి వార్త చరిత్రను లిఖించిందన్నారు.

ప్రస్తుతం జర్నలిజం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, ఒకవైపు ఫేక్ న్యూస్, మరోవైపు సోషల్ మీడియా ఒత్తిడి ఉన్నప్పటికీ జర్నలిస్టులు వాస్తవాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. “వేగం కంటే వాస్తవం ముఖ్యం.. టీఆర్‌పీ కంటే నిజాయితీ ముఖ్యం” అనే విషయాన్ని జర్నలిస్టులు గుర్తుంచుకోవాలని అన్నారు. పాత్రికేయుల కలాలు ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉండాలని, అధికారాన్ని ప్రశ్నించే గొంతుకగా, బాధితులకు భరోసాగా నిలవాలని పిలుపునిచ్చారు.దేశం, నిజం విషయంలో జర్నలిస్టులంతా ఐక్యంగా ఉండాలని, అభిప్రాయాల్లో విభేదాలు ఉన్నా ప్రజాస్వామ్య విలువలను కాపాడేందుకు కలిసికట్టుగా పనిచేయాలని శ్రీకాంత్ అన్నారు.

జర్నలిస్టులకు క్రీడా పోటీలు ఉపశమనం

ప్రెస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్ వాగ్మారే మాట్లాడుతూ.. ప్రతి సంవత్సరం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. నిత్యం వార్తల సేకరణలో బిజీగా ఉండే జర్నలిస్టులకు కొంత ఉపశమనం కల్పించేందుకు క్రీడా పోటీలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. జిల్లా ప్రజలు, అధికారులు, జర్నలిస్టులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి, బిల్డర్ మోహన్, ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు, నగర జర్నలిస్టులు, సబ్ ఎడిటర్లు, స్టాఫ్ రిపోర్టర్లు, ఎడిటర్లు, బ్యూరో చీఫ్‌లు, సీనియర్ జర్నలిస్టులు, జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *