Breaking News

జీజీహెచ్‌లో సమస్యల పరిష్కారానికి చర్యలు వేగవంతం చేయాలి

వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సమీక్షలో ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ విజ్ఞప్తి

ఇందూరు, ఆగస్టు 4: E6 tv NEWS శివ ఠాకూర్

జిల్లా జనరల్ ఆసుపత్రిలో నెలకొన్న మౌలిక వసతుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కోరారు. సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖ విస్తృతస్థాయి సమీక్ష సమావేశంలో ఆయన పలు కీలక అంశాలను ప్రస్తావించారు.

రోజుకు 2 వేల మందికి పైగా ఓపీ – మల్టీ స్పెషాలిటీ సౌకర్యాలు అవసరం

జిల్లా జనరల్ ఆసుపత్రిలో ప్రతిరోజూ 2 వేల మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందుతున్నందున, ఆసుపత్రిని మల్టీ స్పెషాలిటీ స్థాయిలో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ఎంఆర్ఐ, మార్చురీ ఫ్రీజర్లు ఏర్పాటు చేయాలి

ఆసుపత్రిలో ఎంఆర్ఐ స్కానింగ్ యంత్రం, ఆధునిక మార్చురీ ఫ్రీజర్ల కొరత ఉందని, వీటిని వెంటనే ఏర్పాటు చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి

ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ సక్రమంగా పనిచేయక రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల అత్యాధునిక లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు.

సివిల్ పనులు వేగవంతం – వైద్య సిబ్బంది నియామకాలు అవసరం

ఆసుపత్రిలో కొనసాగుతున్న సివిల్ వర్క్స్‌ను త్వరితగతిన పూర్తి చేసి రోగులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అలాగే సివిల్ సర్జన్లు, రెసిడెన్షియల్ మెడికల్ ఆఫీసర్లు (RMOలు), క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ల ఖాళీలను భర్తీ చేయాల్సిన అవసరాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

సమీక్ష సమావేశం అనంతరం జిల్లా జనరల్ ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన సమస్యలపై ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతిపత్రం అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *