Breaking News

ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలే లక్ష్యం

ఆసుపత్రుల సమయపాలన, మందుల లభ్యతపై ప్రత్యేక దృష్టి: డీఎంహెచ్‌ఓ

పాల్వంచ, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రజలకు నిరంతరాయంగా నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు వైద్యాధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ సూచించారు. శుక్రవారం వైద్యాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆసుపత్రుల పనితీరు, ఆరోగ్య కార్యక్రమాలు, మాతా-శిశు ఆరోగ్యం, అసంక్రమిత వ్యాధుల నియంత్రణపై సమీక్షించారు.

ఆసుపత్రుల్లో వైద్యులు, సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ సెలవు రోజుల్లోనూ అత్యవసర వైద్య సేవలు అందేలా సిబ్బందికి విధులు కేటాయించాలని సూచించారు. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.రక్తపోటు, మధుమేహం వంటి అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌ను లక్ష్యాల మేరకు పూర్తి చేసి, గుర్తించిన రోగులకు నిరంతర ఫాలోఅప్, చికిత్స, మందులు అందించాలని సూచించారు. గర్భిణీలకు ఏఎన్‌సీ పరీక్షలు, రక్తహీనత, హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ పరీక్షలు నిర్వహించడంతో పాటు అధిక ప్రమాద గర్భిణీలపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

సమీక్షకు ముందు లక్ష్మీదేవిపల్లి మండలం గట్టుమళ్లలోని ఐడీఓ ఆసుపత్రిని డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని, గడువు ముగిసిన మందులను నిబంధనల ప్రకారం తొలగించాలని ఆదేశించారు. మలేరియా పాజిటివ్ కేసులపై వెంటనే ఫాలోఅప్ చర్యలు చేపట్టాలని సూచించారు.అనంతరం పాల్వంచలో నర్సింగ్ అధికారులతో సమావేశమై హైరిస్క్ గర్భిణీల ఫాలోఅప్, ప్రసవ ప్రణాళిక, బర్త్ వెయిటింగ్ హోమ్స్‌కు ముందస్తు తరలింపు తదితర అంశాలపై సమీక్షించారు. గర్భిణీలు, బాలింతలు సమతుల్య, పోషకాహారం తీసుకునేలా గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని సూచించారు.

కార్యక్రమంలో డా. రాకేష్, డా. బి. రాందాస్, డా. దినేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *