మారెళ్లపాడు లిఫ్ట్‌లో గోదావరి పరవళ్లు.. 16,180 ఎకరాలకు సాగునీటి భరోసా
అశ్వాపురం, సెప్టెంబర్ 7:(E6tv NEWS: ప్రతినిధి).
మణుగూరు, అశ్వాపురం మండలాల రైతుల కళ్లలో దశాబ్దాలుగా మెదులుతున్న సాగునీటి కల సాకారమైంది. వర్షాలు సరిగా లేక భూగర్భ జలాలు అడుగంటడంతో బీడుగా మారిన భూములకు గోదావరి జలాలను అందించాలన్న రైతుల చిరకాల వాంఛ మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంతో నెరవేరే దిశగా కీలక అడుగు పడింది. మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తవడంతో ఆయకట్టు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.ఈ పథకం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మణుగూరు, అశ్వాపురం మండలాల పరిధిలో సుమారు 16,180 ఎకరాలకు సాగునీరు అందనుంది. దీంతో ఈ ప్రాంతంలో వ్యవసాయానికి మరింత భరోసా కలగనుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మంత్రి తుమ్మల కృషికి ఫలితం
సీతారామ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసిన నాటి నుంచే ఈ ప్రాంత రైతుల సాగునీటి సమస్యపై ప్రత్యేక దృష్టి సారించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. తుమ్మలచెరువుతో పాటు అశ్వాపురం మండలాన్ని సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి సంబంధించిన ప్రతిపాదనలను ముందుకు తీసుకెళ్లారని పేర్కొన్నారు.మొదటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న సమయంలో అంచనాలు రూపొందించగా, అనంతరం ప్రతిపాదనలకు మంజూరు లభించింది. అప్పటి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు శంకుస్థాపన చేసినప్పటికీ ప్రభుత్వం మారడంతో ప్రాజెక్టు పరిస్థితిపై రైతుల్లో ఆందోళన నెలకొంది. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవ తీసుకుని ప్రాజెక్టు పనులపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించారని తెలిపారు.
ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు మంత్రి పలుమార్లు క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు దిశానిర్దేశం చేయడంతో పనులు వేగం పుంజుకున్నాయని పేర్కొన్నారు.
ఎమ్మెల్యే పాయం ప్రత్యక్ష పర్యవేక్షణ
మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గడువులోగా పూర్తి చేసి తుమ్మలచెరువుకు నీరు అందించేలా చూడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు సూచించారు.మంత్రి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పనులపై ప్రత్యేక దృష్టి సారించి దాదాపు 20 రోజులపాటు రేయింబవళ్లు ప్రాజెక్టు వద్దే ఉండి పనులను ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేయడంతో నిర్ణీత గడువులోగా ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది.
రైతుల్లో హర్షాతిరేకాలు
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సాగునీటి కల సాకారం కావడంతో తుమ్మలచెరువు ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా గోదావరి జలాలు తమ పొలాలకు చేరితే సాగు విస్తీర్ణం పెరగడంతో పాటు పంటలకు నీటి భరోసా లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.మిగిలిన పనులను సైతం యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ఇంకా సాగునీరు అందని ఆయకట్టు భూములకు కూడా నీరు అందించాలని పినపాక నియోజకవర్గ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, తుమ్మల వీరాభిమాని కోలేటి భవానీశంకర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కోరారు.
ప్రాజెక్టు ముఖచిత్రం
- అంచనా వ్యయం: రూ.113.17 కోట్లు
- సాగునీరు అందే ఆయకట్టు: సుమారు 16,180 ఎకరాలు
- మెయిన్ కెనాల్ పొడవు: 9.850 కి.మీ.
- తొలిదశలో సాగునీరు: సుమారు 7,000 ఎకరాలు
- నీటి వనరు: సీతారామ మెయిన్ కెనాల్
- విధానం: ఎత్తిపోతల ద్వారా తుమ్మలచెరువుకు గోదావరి జలాల తరలింపు
మారెళ్లపాడు లిఫ్ట్ ఇరిగేషన్ ట్రయల్ రన్ విజయవంతం కావడంతో తుమ్మలచెరువు, మణుగూరు ప్రాంత రైతుల దశాబ్దాల నిరీక్షణకు తెరపడినట్లయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం మరింత సస్యశ్యామలంగా మారుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

