కమ్మర్‌పల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా.. కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం
కమ్మర్‌పల్లి, సెప్టెంబర్ 8: (E6tv NEWS: ప్రతినిధి).
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను దూషించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు మంగళవారం కమ్మర్‌పల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బోనగిరి భాస్కర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పంచాయతీరాజ్ ట్రిబ్యునల్ సభ్యుడు బస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ.. శాసనసభ ప్రజాస్వామ్యానికి ప్రతీకగా, పవిత్రమైన ప్రదేశంగా భావిస్తారని అన్నారు. అలాంటి ప్రదేశంలో స్పీకర్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొన్నారు.
స్పీకర్‌ను దూషించిన ఘటనపై ఎమ్మెల్సీ తాత మధును శాసన మండలి నుంచి తక్షణమే డిస్మిస్ చేయాలని, ఘటనపై చట్టపరమైన విచారణ జరిపి, వర్తించే నిబంధనలతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. తాత మధుపై కమ్మర్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, వైస్ చైర్మన్ సుంకేట బుచ్చెన్న, జిల్లా కిసాన్ ఖేత్ ఉపాధ్యక్షుడు ప్రవీణ్, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఏలేటి మోహన్, బషీరాబాద్ మురళి, నర్సాపూర్ సంజీవ్ యాదవ్, డీసీసీ నాయకులు తిప్పిరెడ్డి శ్రీనివాస్, తక్కురి దేవేందర్, జైడి శ్రీనివాస్, రఫి, బోనగిరి లక్ష్మణ్, బాల్కొండ యూత్ ఉపాధ్యక్షుడు రిత్విక్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు నరేందర్, యూత్ ఉపాధ్యక్షులు శిలేందర్, జగదీశ్, నిమ్మ ప్రసాద్, తక్కురి శేఖర్, సుమన్ పాషా, పట్టణ అధ్యక్షుడు సాల్లూరి గణేష్, తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


