ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదు
ఫోటో జర్నలిస్టుల సేవలు అమోఘం
ఇందూరు, ఆగస్టు 19:( E6tv NEWS:శివ ఠాకూర్).
ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. ప్రపంచ ఫోటోగ్రఫీ డే సందర్భంగా నగరంలోని ప్రెస్ క్లబ్‌లో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.ఫోటోగ్రాఫర్ అంటే కేవలం కెమెరా ఆపరేటర్ కాదని, సమాజంలో జరిగే మంచి, చెడు, చారిత్రక సంఘటనలను భవిష్యత్ తరాలకు భద్రపరిచే బాధ్యత కలిగిన వ్యక్తి అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. చరిత్రలోని ఎన్నో ముఖ్య ఘట్టాలు ఫోటోల ద్వారానే నేటికీ మనకు గుర్తుండిపోయాయని తెలిపారు.ప్రకృతి విపత్తులు, సామాజిక కార్యక్రమాలు, ప్రజా సమస్యలు, విజయాలు, ప్రజా ఉద్యమాలు తదితర అంశాలను ప్రజల ముందుకు తీసుకురావడంలో ఫోటో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సంఘటనలను ప్రజలకు కళ్లకు కట్టినట్లు చూపించే ఫోటో జర్నలిస్టుల సేవలు అభినందనీయమన్నారు.
జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం కృషి
జర్నలిస్టుల చిరకాల వాంఛ అయిన ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం తనవంతు కృషి చేస్తానని ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. ఈ అంశాన్ని గతంలో అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. నిజామాబాద్ జర్నలిస్టుల్లో ఐక్యత ఉందని, ఇదే స్ఫూర్తితో భవిష్యత్‌లోనూ ముందుకు సాగాలని సూచించారు.

కార్యక్రమంలో ప్రెస్ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రతన్, ప్రధాన కార్యదర్శి భానూతేజ, గౌరవ అధ్యక్షుడు గోవిందరాజు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పంచరెడ్డి శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి సుభాష్, కోశాధికారి రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి రాజు, సీనియర్ ఫోటోగ్రాఫర్లు బాలరాజు, నరసింహచారి, శ్రీనివాస్, ఇంగు శ్రీనివాస్, వీడియో జర్నలిస్టు అసోసియేషన్ అధ్యక్షుడు నాగేష్‌తో పాటు పలువురు సీనియర్ ఫోటో జర్నలిస్టులు, జర్నలిస్టులు పాల్గొన్నారు.


