Breaking News

కోదాడలో 10 ఇళ్ల దొంగతనాలు ఛేదించిన పోలీసులు

రూ.60 లక్షల విలువైన బంగారం, వెండి, నగదు, కారు స్వాధీనం

కోదాడ, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి). కోదాడ పట్టణంలో వరుస ఇళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని కోదాడ పట్టణ పోలీసులు, జిల్లా సీసీఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి సుమారు రూ.60 లక్షల విలువైన 37.2 తులాల బంగారం, 470 గ్రాముల వెండి, రూ.3.60 లక్షల నగదు, హోండా అమేజ్ కారు, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.సూర్యాపేట జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కె. నర్సింహ, ఐపీఎస్ దొంగతనాల కేసుల దర్యాప్తు, నిందితుడి అరెస్ట్ వివరాలను వెల్లడించారు.

తాళం వేసిన ఇళ్లే లక్ష్యం

అరెస్టయిన నిందితుడిని పట్నం శెట్టి రాజు @ రాజిరెడ్డి (41)గా పోలీసులు గుర్తించారు. ఇతను హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్ట పరిధిలోని పాపిరెడ్డినగర్ కాలనీకి చెందినవాడు. వృత్తిరీత్యా కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు.సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడేవాడని పోలీసులు తెలిపారు. తన కారును నిర్మానుష్య ప్రాంతంలో నిలిపి, నడుచుకుంటూ వెళ్లి ఇళ్ల ప్రధాన ద్వారాల తాళాలను స్క్రూడ్రైవర్‌తో పగులగొట్టి లోపలికి ప్రవేశించేవాడని చెప్పారు. చేతి గ్లౌజులకు బదులుగా షూ సాక్స్‌లు ఉపయోగించేవాడని వెల్లడించారు.దొంగిలించిన బంగారు, వెండి ఆభరణాల్లో కొన్నింటిని విక్రయించడంతో పాటు మరికొన్నింటిని కరిగించి, కొన్ని ఆభరణాలను ఫైనాన్స్ సంస్థల్లో కుదవపెట్టి వచ్చిన డబ్బును వ్యక్తిగత అవసరాలకు, అప్పుల చెల్లింపులకు వినియోగించేవాడని పోలీసులు తెలిపారు.

నకిలీ నంబర్‌తో సంచారం

పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు తన కారు అసలు రిజిస్ట్రేషన్ నంబర్ AP 28 BY 7770కు బదులుగా TS 07 GC 1612 నకిలీ నంబర్‌ను ఉపయోగించేవాడని పోలీసులు వెల్లడించారు.

2021 నుంచి ఇప్పటి వరకు కోదాడ పట్టణంలో మొత్తం 10 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు విచారణలో అంగీకరించినట్లు తెలిపారు. 2026లోనే ఏడు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

పోలీసుల నిఘాతో పట్టుబాటు

కోదాడ పట్టణంలో వరుస దొంగతనాల నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించారు. హైదరాబాద్ నుంచి ప్రయాణికులను కారులో కోదాడకు తీసుకొచ్చిన అనంతరం రాత్రివేళల్లో అక్కడే ఉండి, తెల్లవారుజామున తాళాలు వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దొంగతనాలకు పాల్పడేవాడని గుర్తించారు.విజయవాడకు దొంగిలించిన బంగారు వస్తువులను కారులో తరలించి విక్రయించేందుకు వెళ్తున్న సమయంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. సూర్యాపేట నుంచి కోదాడ మీదుగా హుజూర్‌నగర్ ఫ్లైఓవర్ వద్దకు చేరుకున్న నిందితుడు పోలీసులను గమనించి వాహనాన్ని వెనక్కి తీసుకుని తప్పించుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కారు డిక్కీలో తనిఖీ చేయగా బంగారు, వెండి ఆభరణాలు, నగదు లభించాయి. స్క్రూడ్రైవర్లు, షూ సాక్స్‌లు కూడా లభించడంతో పోలీసులు నిందితుడిని విచారించగా కోదాడలో చేసిన దొంగతనాల వివరాలను వెల్లడించినట్లు తెలిపారు.

నిందితుడి నుంచి హోండా అమేజ్ కారు, వివో Y31 5G మొబైల్ ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసులపై తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

ఈ సందర్భంగా ఎస్పీ కె. నర్సింహ మాట్లాడుతూ.. నేరాలకు పాల్పడిన వారు ఎప్పటికైనా చట్టానికి చిక్కక తప్పదని అన్నారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.ప్రతి ఇంటి వద్ద సీసీ కెమెరాలు, అలారం సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని, ఎక్కువ రోజులు ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే సమయంలో విలువైన వస్తువులు, నగదును ఇంట్లో ఉంచవద్దని సూచించారు. ఇరుగు పొరుగు వారికి, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 112కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.

దొంగతనాల కేసుల దర్యాప్తును పర్యవేక్షించిన కోదాడ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, నిందితుడిని అరెస్ట్ చేయడంలో కీలకంగా పనిచేసిన సీసీఎస్ ఇన్‌స్పెక్టర్ శివకుమార్, కోదాడ పట్టణ ఇన్‌స్పెక్టర్ శివశంకర్, సీసీఎస్ ఎస్‌ఐలు హరికృష్ణ, సాయిరాం, ఎస్‌ఐ అజయ్‌కుమార్‌తో పాటు సిబ్బంది వెంకన్న, విద్యాసాగర్, మల్లేష్, సతీష్, శివ, ప్రభాకర్, మంజులను ఎస్పీ అభినందించి రివార్డులు అందజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *