కబ్జా చేసిన స్థలంలో అక్రమ నిర్మాణాలు నిలిపివేత
స్థలం ఖాళీ చేయకపోతే రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కఠిన చర్యలు
ఇరిగేషన్ ఏఈ రవికుమార్ హెచ్చరిక
రుద్రూర్, ఆగస్టు 30:(E6tv NEWS ప్రతినిధి).
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం సులేమాన్ ఫారం గ్రామంలో ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్న ఘటనపై అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఇరిగేషన్ శాఖ ఏఈ రవికుమార్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.
సులేమాన్ నగర్ గ్రామంలోని డీ-28 నిజాంసాగర్ కెనాల్ బౌండరీ పక్కన సుమారు 150 అడుగులు (50 మీటర్లు) మేర ఇరిగేషన్ శాఖకు చెందిన స్థలం ఉన్నట్లు అధికారులు గుర్తించారు. సదరు స్థలాన్ని ఓ వ్యక్తి ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నట్లు గుర్తించిన అధికారులు వెంటనే నిర్మాణ పనులను నిలిపివేశారు.ఇరిగేషన్ శాఖకు సంబంధించిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని, ఆక్రమించిన స్థలాన్ని వెంటనే ఖాళీ చేయాలని ఏఈ రవికుమార్ ఆదేశించారు. అధికారుల ఆదేశాలను పాటించకుండా స్థలాన్ని ఖాళీ చేయని పక్షంలో రెవెన్యూ, పోలీస్ శాఖల సహకారంతో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అవసరమైతే ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి, సంబంధిత శాఖల సమన్వయంతో ఆక్రమణను తొలగించేందుకు చర్యలు చేపడతామని ఏఈ స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖకు చెందిన భూములను ఎవరూ ఆక్రమించవద్దని ఆయన సూచించారు.
ఇరిగేషన్ స్థలంలో జరుగుతున్న అక్రమ ఆక్రమణను గుర్తించి వెంటనే స్పందించిన ఏఈ రవికుమార్‌పై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి చెందిన ఇరిగేషన్ భూములను కాపాడేందుకు అధికారులు తీసుకున్న చర్యలను గ్రామస్తులు అభినందించారు. భవిష్యత్తులో ఇలాంటి ఆక్రమణలకు తావులేకుండా అధికారులు మరింత కఠినంగా వ్యవహరించాలని వారు కోరారు.

