హోంగార్డుతో నిర్వహణపై ప్రజల అసంతృప్తి
భీంగల్ బస్టాండ్‌కు శాశ్వత కంట్రోలర్‌ను నియమించాలని డిమాండ్
భీంగల్, ఆగస్టు 8: (E6 tv NEWS ప్రతినిధి).
నిజామాబాద్ జిల్లా భీంగల్ మున్సిపాలిటీ బస్టాండ్‌లో ఆర్టీసీ కంట్రోలర్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కంట్రోలర్ స్థానంలో డిపోలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డును బస్టాండ్‌కు నియమించడంతో ప్రయాణికులకు సరైన సమాచారం అందడం లేదని ఆరోపిస్తున్నారు.
స్థానికుల కథనం ప్రకారం, భీంగల్ బస్టాండ్ నుంచి వేల్పూర్, బోధన్, నిజామాబాద్, కామారెడ్డి, మెట్పల్లి తదితర ప్రాంతాలకు ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. అయితే బస్టాండ్‌లో అధికారిక కంట్రోలర్ లేకపోవడంతో బస్సుల సమయాలు, ప్లాట్ఫారంల వివరాలు, ఇతర సమాచారాన్ని ప్రయాణికులకు అందించే పరిస్థితి లేదని అంటున్నారు.భీంగల్‌లో గతంలో ఆర్టీసీ డిపో ఏర్పాటు చేసినప్పటికీ కొంతకాలానికే డిపోను రద్దు చేశారని, ప్రస్తుతం భద్రత కోసం మాత్రమే సెక్యూరిటీ సిబ్బంది ఉండాల్సిన చోట హోంగార్డును కంట్రోలర్‌గా విధులు నిర్వహించేలా చేయడం సరైన విధానం కాదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. హోంగార్డుకు కంట్రోలర్‌కు అవసరమైన సమాచార వ్యవస్థ, కమ్యూనికేషన్ సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటున్నారు.
భీంగల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చెందడంతో పాటు ఇటీవల కోర్టు కూడా ఏర్పాటు కావడంతో సిరికొండ, మోర్తాడ్, కమ్మర్పల్లి, ఏర్గట్ల, భీంగల్ మండలాలకు చెందిన ప్రజలు నిత్యం బస్టాండ్‌ను వినియోగిస్తున్నారని తెలిపారు. అయినప్పటికీ కంట్రోలర్ పోస్టును భర్తీ చేయకపోవడం వల్ల ప్రయాణికులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించే పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భీంగల్ బస్టాండ్‌లో ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని వెంటనే శాశ్వత కంట్రోలర్‌ను నియమించాలని, బస్సుల సమాచారాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచే చర్యలు తీసుకోవాలని స్థానికులు ఆర్టీసీ ఉన్నతాధికారులను కోరుతున్నారు. అధికారులు స్పందించి భీంగల్ బస్టాండ్‌లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

