Breaking News

నేరాల నియంత్రణ, నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు సత్వర న్యాయం అందించాలి: జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్

కామారెడ్డి, ఆగస్టు 3: E6 tv NEWS (ప్రతినిధి).

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి పోలీసు అధికారులతో నెలవారీ క్రైమ్ రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో నేరాల నివారణ, పెండింగ్ కేసుల దర్యాప్తు, శాంతిభద్రతలు, ప్రజా భద్రతకు సంబంధించిన అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టి బాధితులకు సత్వర న్యాయం అందించాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా గ్రేవ్ కేసుల్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) ప్రకారం దర్యాప్తు పూర్తి చేసి నిర్ణీత గడువులోగా చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని సూచించారు. పోక్సో, మహిళలపై నేరాలు, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ, మిస్సింగ్ కేసులు, నాన్ బెయిలబుల్ వారెంట్ల అమలులో వేగం పెంచి, సైంటిఫిక్ ఎవిడెన్స్, సాంకేతిక ఆధారాలను సమర్థంగా వినియోగించి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లాంగ్ పెండింగ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని సూచించారు.

పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుతో మర్యాదపూర్వకంగా వ్యవహరించి, వారి సమస్యలను శ్రద్ధగా విని సత్వర పరిష్కారం అందించాలని తెలిపారు. ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసం పెరగాలంటే స్పందనలో మానవీయ దృక్పథం, సేవల్లో వేగం, దర్యాప్తులో నిబద్ధత ఉండాలని పేర్కొన్నారు.జిల్లాలో గంజాయి, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. సైబర్ బాధితులకు తక్షణ స్పందన అందించి, వారి డబ్బులు తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల్లో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలని అధికారులకు సూచించారు.

అలాగే సీసీటీఎన్‌ఎస్ (CCTNS) ద్వారా కేసు రికార్డులను నిర్ణీత సమయంలో అప్‌లోడ్ చేసి, పెండింగ్ కేసులను గడువులోగా పూర్తి చేసి చార్జ్‌షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. మహిళలు, చిన్నారుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు.కమ్యూనిటీ పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని, ప్రతి పోలీసు అధికారి గ్రామాలను తరచూ సందర్శిస్తూ ప్రజలతో సమన్వయం పెంచుకోవాలని సూచించారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా సమాచార వ్యవస్థను బలోపేతం చేసి, నేరాల నియంత్రణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపారు. రౌడీషీటర్లు, నేర చరిత్ర కలిగిన వ్యక్తులపై నిరంతర నిఘా ఉంచి అవసరమైన చట్టపరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

జిల్లాలో కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వాలని, గ్రామాలు, పట్టణాల ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లు, ప్రధాన కూడళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రార్థనా స్థలాలు, పరిశ్రమలు, పెట్రోల్ బంకులు, ధాబాలు వంటి ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు కోసం కృషి చేయాలని సూచించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన కెమెరాలు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో తరచూ తనిఖీ చేసి, సాంకేతిక లోపాలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు.డయల్-100కు వచ్చే ప్రతి కాల్‌పై వెంటనే స్పందించి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు తక్షణ సహాయం అందించాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. ప్రజలకు నాణ్యమైన పోలీసు సేవలు అందించడం, నేరాలను సమర్థవంతంగా నియంత్రించడం పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *