కామారెడ్డి, ఆగస్టు 22: (E6tv NEWS ప్రతినిధి).
కామారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే నవజాత శిశువు మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. సకాలంలో ప్రసవం చేయకపోవడంతోనే ఈ ఘటన చోటుచేసుకుందని ఆరోపిస్తూ ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం ఉదయం సుమారు 9 గంటలకు స్వరూప అనే బాలింతను ప్రసవం కోసం కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆమెకు తీవ్ర ప్రసవ నొప్పులు ఉన్నప్పటికీ వైద్యులు వెంటనే ఆపరేషన్ చేయకుండా నార్మల్ డెలివరీ కోసం వేచి చూశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరిస్థితి విషమిస్తున్న నేపథ్యంలో ఆపరేషన్ చేయాలని పలుమార్లు కోరినా వైద్యులు పట్టించుకోలేదని వారు పేర్కొన్నారు.
చివరకు శనివారం ఆపరేషన్ నిర్వహించగా.. మగ శిశువు మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సకాలంలో డెలివరీ చేసి ఉంటే శిశువు ప్రాణాలతో ఉండేదని ఆరోపిస్తూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. వైద్యుల నిర్లక్ష్యం నిజమేనా? లేక వైద్యపరమైన కారణాలతోనే శిశువు మృతి చెందిందా? అనే విషయాలపై అధికారులు విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సి ఉంది.

