Breaking News

బాసర ఐఐఐటీలో విద్యార్థి అదృశ్యం కలకలం.. నాందేడ్‌లో క్షేమంగా లభ్యం

బాసర, జూలై 31 (E6 tv న్యూస్): A, తిరుపతి గౌడ్.

నిర్మల్ జిల్లా బాసరలోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (ఆర్‌జీయూకేటీ-ఐఐఐటీ)లో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న విద్యార్థి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. రంగారెడ్డి జిల్లాకు చెందిన యశ ఋషింద్ర రెడ్డి శుక్రవారం ఉదయం నుంచి కనిపించకుండా పోవడంతో కళాశాల అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు.విద్యార్థి తల్లిదండ్రులను సంప్రదించిన అనంతరం కళాశాల అధికారులు ఉదయం అతనికి అవుట్‌పాస్ మంజూరు చేశారు. అనంతరం యశ ఋషింద్ర రెడ్డి తన తల్లిదండ్రులకు మొబైల్ ఫోన్ ద్వారా సందేశం పంపి కనిపించకుండా పోయినట్లు సమాచారం.

ఈ క్రమంలో బాసర రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ సమీపంలోని పట్టాల వద్ద విద్యార్థి ఐడీ కార్డు, మొబైల్ ఫోన్ లభ్యమవడంతో ఆందోళన నెలకొంది. విచారణలో బాసర నుంచి మహారాష్ట్రలోని నాగర్‌సోల్‌కు రైలు టికెట్ బుక్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.దీంతో బాసర పోలీసులు రైల్వే పోలీసుల సహకారంతో బాసర రైల్వే స్టేషన్ పరిసరాలు, గోదావరి నది వద్ద గాలింపు చర్యలు చేపట్టారు. అదే సమయంలో మహారాష్ట్రలోని నాందేడ్, పర్భని రైల్వే పోలీసులను అప్రమత్తం చేశారు.

పోలీసుల సమన్వయంతో నాందేడ్ రైల్వే స్టేషన్‌లో విద్యార్థిని గుర్తించి అదుపులోకి తీసుకుని బాసర పోలీసులకు సమాచారం అందించారు. విద్యార్థి క్షేమంగా లభించడంతో కళాశాల అధికారులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.విద్యార్థి అదృశ్యానికి గల కారణాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *