కమ్మర్పల్లి పోలీసుల చాకచక్యానికి ప్రజల ప్రశంసలు
కమ్మర్పల్లి, ఆగస్టు 6: (E6 tv NEWS. ప్రతినిధి)
కమ్మర్పల్లి పోలీసుల సమర్థవంతమైన చర్యలతో అదృశ్యమైన ఓ బాలుడిని గంటల వ్యవధిలోనే గుర్తించి క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసుల వేగవంతమైన స్పందనపై స్థానిక ప్రజలు, బాలుడి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసు సిబ్బందిని అభినందించారు.
కమ్మర్పల్లి గ్రామానికి చెందిన టేకు కృష్ణ ప్రసాద్ (15) గురువారం ఉదయం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు కమ్మర్పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే కేసు నమోదు చేసిన ఎస్సై సీహెచ్. సతీష్ తన సిబ్బంది కానిస్టేబుళ్లు నరేష్, దినేష్, హరీష్లతో కలిసి విచారణ ప్రారంభించారు.పోలీసులు సీసీటీవీ కెమెరాల దృశ్యాలను నిశితంగా పరిశీలించి, బాలుడి కదలికలను గుర్తించారు. అనంతరం ఆర్మూర్‌లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద బాలుడు ఉన్నట్లు గుర్తించి, అతడిని సురక్షితంగా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు.

తమ కుమారుడిని గంటల వ్యవధిలోనే క్షేమంగా గుర్తించి అప్పగించినందుకు బాలుడి తల్లిదండ్రులు కమ్మర్పల్లి ఎస్సై సీహెచ్. సతీష్‌తో పాటు పోలీసు సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక ప్రజలు కూడా పోలీసుల అప్రమత్తతను అభినందించారు.ఈ సందర్భంగా సాంకేతిక పరిజ్ఞానం, ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల వినియోగంతో వేగంగా స్పందించి బాలుడిని గుర్తించిన కమ్మర్పల్లి ఎస్సై సీహెచ్. సతీష్ పనితీరును నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసించారు.

