బాన్సువాడ, ఆగస్టు 25: (E6tv NEWS: ప్రతినిధి)
రాష్ట్రంలో విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బాన్సువాడ నియోజకవర్గంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థుల పక్షాన కార్యక్రమం నిర్వహించారు.బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు చేపట్టిన రెండు రోజుల నిరాహార దీక్షకు మద్దతుగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా “ఫీజు బకాయిలు వెంటనే చెల్లించాలి.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలి” అంటూ నినాదాలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల న్యాయమైన హక్కుల కోసం బీజేపీ నిరంతరం పోరాటం చేస్తుందని, ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బకాయిలను చెల్లించాలని కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పైడిమల లక్ష్మీనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, కోణాల గంగారెడ్డి, కౌన్సిలర్లు గజ్జల మహేష్, పాశం భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్, అంది చిరంజీవి, చీకట్ల రాజుతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

