ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్న మరో 10 మంది పేదలను ఆదుకోవాలిరోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి
రోడ్డు పనులు వెంటనే చేపట్టాలి.. అంబం ఆర్ సర్పంచ్, ఉపసర్పంచ్ విజ్ఞప్తి
రుద్రూర్, సెప్టెంబర్ 4: (E6tv NEWS: ప్రతినిధి)
గ్రామంలో ఇల్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండలం అంబం ఆర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కుర్లెపు గంగాధర్ ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే గ్రామానికి 25 ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనప్పటికీ, మరో పది మంది నిరుపేద కుటుంబాలు సొంత ఇల్లు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. గ్రామ అభివృద్ధిలో ప్రజలు భాగస్వాములై సహకరిస్తుండటం గర్వంగా ఉందన్నారు. ఇందుకు గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అర్హత ఉన్నప్పటికీ ఇంకా పెన్షన్లు అందని వారికి కూడా ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఏళ్లుగా రోడ్డు దుస్థితి.. గుంతలమయంగా ప్రధాన రహదారి
అంబం ఆర్ గ్రామపంచాయతీ నుంచి రుద్రూర్ వైపు వెళ్లే రహదారితో పాటు తగిలేపల్లి నుంచి వర్ని వెళ్లే ప్రధాన రహదారి అనేక ఏళ్లుగా అధ్వానంగా మారిందని గ్రామ ఉపసర్పంచ్, ఐదో వార్డు సభ్యుడు రేపల్లె సాయి ప్రసాద్ తెలిపారు. రహదారి పూర్తిగా గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.రోడ్డు నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.33 కోట్లు మంజూరు చేసినప్పటికీ, ఇప్పటివరకు సుమారు 12 సార్లు టెండర్లు నిర్వహించినా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో పనులు ప్రారంభం కాలేదని తెలిపారు. దీంతో రహదారి పరిస్థితి మరింత అధ్వానంగా మారిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని టెండర్ ప్రక్రియను పూర్తి చేసి రోడ్డు పనులు ప్రారంభించాలని కోరారు.తమపై నమ్మకంతో పదవులు అప్పగించిన గ్రామ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటామని సాయి ప్రసాద్ తెలిపారు. గ్రామ ప్రజల సేవలో అహర్నిశలు నిమగ్నమై, గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పారు. ప్రజల సమస్యల పరిష్కారంలో ఎల్లవేళలా ముందుంటామని పేర్కొన్నారు. గ్రామ అభివృద్ధికి ప్రజలు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు.

