కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, ఎంపీ ధర్మపురి అరవింద్
రోడ్లు, వంతెనలు, కొత్త జాతీయ రహదారి కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి
నిజామాబాద్, ఆగస్టు 8: (E6 tv NEWS, శివ ఠాకూర్)
నిజామాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి పలు కీలక రోడ్లు, వంతెనలు, జాతీయ రహదారి నిర్మాణ ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ తెలిపారు. శుక్రవారం నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో కలిసి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కలిసి అభివృద్ధి ప్రతిపాదనలను సమర్పించారు.
దేవీ రోడ్డు, నాందేవాడ ఆర్వోబీకి ప్రాధాన్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నగరంలోని దేవీ రోడ్డు, రైల్వే స్టేషన్ సమీపంలో నాందేవాడ అదనపు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ROB) నిర్మాణానికి ఆమోదం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. అలాగే సోనీ ఫంక్షన్ హాల్ సమీపంలోని ఎల్లమ్మగుట్ట వద్ద రైల్వే అండర్ బ్రిడ్జి (RUB) నిర్మాణం అత్యవసరమని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి సుమారు రూ.170 కోట్ల నిధులు అవసరమని వివరించారు.
ఆర్ అండ్ బీ రోడ్డు అభివృద్ధికి రూ.30 కోట్ల ప్రతిపాదన
నిజామాబాద్ రేడియో స్టేషన్ నుంచి ముదక్‌పల్లి పాత జీపీ కార్యాలయం వరకు ఆర్ అండ్ బీ రహదారి అభివృద్ధి కోసం రూ.30 కోట్లతో ప్రతిపాదనలు సమర్పించినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ రహదారి అభివృద్ధి ద్వారా నగర ట్రాఫిక్ సమస్యలకు కొంత మేర పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
107 కిలోమీటర్ల కొత్త జాతీయ రహదారి ప్రతిపాదన
వర్ని జంక్షన్ నుంచి నిజామాబాద్, డిచ్‌పల్లి, ఇందల్వాయి, భీంగల్ మీదుగా కమ్మర్‌పల్లి వరకు 107 కిలోమీటర్ల పొడవుతో కొత్త జాతీయ రహదారి నిర్మించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు తెలిపారు. ఈ రహదారి ద్వారా జిల్లాలో రవాణా సౌకర్యాలు మెరుగుపడటంతో పాటు ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిస్తుందని అన్నారు.
కాలూర్ రోడ్డు పూర్తి చేయాలని విజ్ఞప్తి
నగరంలోని రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం, దుబ్బ మీదుగా కాలూర్ రోడ్డు పనులను పూర్తిచేయాలని కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి విజ్ఞప్తి చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
ఈ భేటీలో రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి అభయ్ పాటిల్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

