Breaking News

గణేష్ ఉత్సవ మండపాల నిర్వాహకులు నిబంధనలు తప్పక పాటించాలి: డీఎస్పీ ఆదినారాయణ

కొత్తగూడెం, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి)

గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్, మున్సిపల్ శాఖల నిబంధనలు మరియు సూచనలను తప్పనిసరిగా పాటించాలని కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ సూచించారు.
గణేష్ మండపం ఏర్పాటు చేయడానికి ముందుగా సంబంధిత పోలీస్, మున్సిపల్ అధికారుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని తెలిపారు. రోడ్లపై, ఇరుకైన వీధుల్లో, వివాదాస్పద స్థలాల్లో లేదా ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించే ప్రదేశాల్లో మండపాలు ఏర్పాటు చేయకూడదని సూచించారు. మండపం, స్టేజ్, స్వాగత తోరణాలు ట్రాఫిక్‌కు, అత్యవసర వాహనాల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
మండపం వద్ద ప్రవేశం, నిష్క్రమణ మార్గాలను వేర్వేరుగా ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్‌ను నిర్ణయించిన ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని సూచించారు. పెద్ద మండపాల వద్ద CCTV కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని, రాత్రి సమయంలో బాధ్యత కలిగిన నిర్వాహకులు, వాలంటీర్లు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
అగ్ని ప్రమాదాల నివారణకు నీటి డ్రమ్ములు, ఇసుక బస్తాలు, ఫైర్ ఎక్స్‌టింగ్విషర్లు, అందుబాటులో సిద్ధంగా ఉంచాలని సూచించారు. విద్యుత్ వైరింగ్‌ను నిపుణుల ద్వారా సురక్షితంగా చేయించుకోవాలని, అనుమతి లేకుండా విద్యుత్ కనెక్షన్లు వినియోగించకూడదని స్పష్టం చేశారు.
లౌడ్‌స్పీకర్లు, సౌండ్ సిస్టమ్ వినియోగానికి అవసరమైన అనుమతులు పొందాలని, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్‌స్పీకర్లు, సౌండ్ సిస్టం వినియోగించకూడదని తెలిపారు. నిర్ణయించిన శబ్ద పరిమితులను పాటించాలని, డీజేలు నిషేధమని సూచించారు.
మండపాల వద్ద మద్యం సేవించి గొడవలకు పాల్పడటం, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. విరాళాలను స్వచ్ఛందంగా మాత్రమే స్వీకరించాలని, ఎవరినీ బలవంతం చేయకూడదని సూచించారు. మండపాల చుట్టూ వ్యాపారులు, ఆహార స్టాళ్లు ఏర్పాటు చేసినప్పుడు రహదారులను ఆక్రమించకుండా చూడాలని తెలిపారు.
ఇతర మతాల ప్రార్థనా స్థలాలకు సమీపంలో వివాదాలకు దారితీసే విధంగా బ్యానర్లు, పోస్టర్లు, జెండాలు ఏర్పాటు చేయకూడదని, విగ్రహం, మండపం, అలంకరణలు అన్ని వర్గాల ప్రజల మనోభావాలను గౌరవించే విధంగా ఉండాలని సూచించారు. వీలైనంత వరకు పర్యావరణహిత మట్టి విగ్రహాలను వినియోగించాలని కోరారు.
విగ్రహ నిమజ్జనం కోసం అధికారులు సూచించిన మార్గాలు, నిమజ్జన కేంద్రాలను మాత్రమే వినియోగించాలని తెలిపారు. నిమజ్జన ఊరేగింపు సమయంలో ట్రాఫిక్, పోలీస్ అధికారులు ఇచ్చే సూచనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని కోరారు.
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా, సామరస్యంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు మండపాల నిర్వాహకులు పోలీస్ శాఖకు పూర్తిగా సహకరించాలని కొత్తగూడెం డీఎస్పీ విజ్ఞప్తి చేశారు.

అత్యవసర పరిస్థితుల్లో పోలీస్ – 100, ఫైర్ – 101, అంబులెన్స్ – 108 నంబర్లను సంప్రదించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో కొత్తగూడెం త్రీ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఎస్హెచ్ఓ ప్రవీణ్ కుమార్, ఎస్సై రమేష్, సిబ్బంది పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *