Breaking News

హుజూర్‌నగర్‌లో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన

హుజూర్‌నగర్, ఆగస్టు 17:(E6tv NEWS: ప్రతినిధి).

మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు డ్రగ్స్, సైబర్ నేరాలు, రోడ్డు భద్రత తదితర అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

జిల్లా ఎస్పీ కె. నరసింహ, ఐపీఎస్ ఆదేశాల మేరకు హుజూర్‌నగర్ సీఐ చరమందరాజు, ఎస్‌ఐ చలిగంటి నరేష్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పోలీస్ కళాబృందం ద్వారా గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాల దుష్ప్రభావాలు, ట్రాఫిక్ నిబంధనలు, సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాల నివారణ, షీ టీమ్స్ సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ చలిగంటి నరేష్ మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో సైబర్ నేరాల నియంత్రణ, గంజాయి, మత్తు పదార్థాల నిర్మూలన, రోడ్డు భద్రత, మహిళల రక్షణకు సంబంధించి పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఇంటర్నెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.బ్యాంక్ ఖాతా వివరాలు, ఏటీఎం కార్డు నంబర్, పిన్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ వెల్లడించవద్దని హెచ్చరించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయకుండా, వ్యక్తిగత వివరాలను నమోదు చేయవద్దని సూచించారు. సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని, వేధింపులకు గురైతే 112కు సమాచారం అందించాలని తెలిపారు. యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, భవిష్యత్తుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో పాఠశాల హెడ్‌మాస్టర్ మహబూబ్ జాని, కానిస్టేబుళ్లు జానిమియా, మహేష్, మహిళా కానిస్టేబుల్ అనూష, హోంగార్డ్ కాశయ్య, పోలీస్ కళాబృందం ఇన్‌చార్జ్ యల్లయ్య, సభ్యులు గోపయ్య, సత్యం, చారి, కృష్ణ, నాగార్జున, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *