Breaking News

పాపన్న జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి

ముధోల్, ఆగస్టు 18:(E6tv NEWS: A. తిరుపతి గౌడ్).

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలని గౌడ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన పాపన్న గౌడ్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముధోల్ నియోజకవర్గ గౌడ సంఘాల నాయకులు బయలుదేరారు.

ఈ సందర్భంగా ముధోల్ నియోజకవర్గ కేంద్రంలోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ.. ఆనాటి అగ్రవర్ణాల అరాచకాలను పాపన్న గౌడ్ ముందుగానే గుర్తించి, దళిత, బడుగు, బలహీన వర్గాల ప్రజలను ఏకం చేసి వారి హక్కుల కోసం పోరాడారని కొనియాడారు.గోల్కొండ నవాబును ఎదిరించి ఆ రాజ్యాన్ని జయించిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని అన్నారు. ఆయన ధైర్యం, పోరాట స్ఫూర్తి, నాయకత్వ లక్షణాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.

ప్రస్తుతం బడుగు, బలహీన వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ, ఉద్యోగ, ఉపాధి, విద్య, వైద్య రంగాల్లో తగిన వాటా కల్పించాలని నాయకులు డిమాండ్ చేశారు. జనాభాలో అధిక శాతం ఉన్న బడుగు, బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.బడుగు, బలహీన వర్గాల ప్రజలు ఐక్యంగా తమ హక్కుల కోసం పోరాడి, సామాజిక న్యాయం సాధించుకున్నప్పుడే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘనమైన నివాళి అర్పించినట్లవుతుందని గౌడ సంఘాల నాయకులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *