ఎస్సారెస్పీ, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టుల పరిశీలన
ప్రాజెక్టుల పునరుద్ధరణకు కార్యాచరణ రూపొందిస్తున్న ప్రభుత్వం
రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రులు
నిజామాబాద్ ఆగస్టు 1: (E6 tv NEWS శివ ఠాకూర్)
ఉత్తర తెలంగాణకు సాగు, తాగునీటిని అందించే కీలక జలాశయాలైన శ్రీరాంసాగర్ (ఎస్సారెస్పీ), కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులను రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో పరిస్థితులు, సాగునీటి పంపిణీపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, తెలంగాణకు గర్వకారణమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 1963లో నాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేయగా, 1970లో తొలిసారిగా నీటి విడుదల జరిగిందని గుర్తు చేశారు. ప్రాజెక్టు అసలు నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలు కాగా, పూడిక పేరుకుపోవడంతో ప్రస్తుతం అది సుమారు 80 టీఎంసీలకు తగ్గిందని తెలిపారు.ప్రాజెక్టు అసలు నిల్వ సామర్థ్యాన్ని తిరిగి పునరుద్ధరించడమే రాష్ట్ర ప్రభుత్వ తొలి లక్ష్యమని పేర్కొన్న మంత్రులు, ఈ అంశంపై నిపుణులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. రానున్న రోజుల్లో ప్రాజెక్టుకు వచ్చే వరదనీటిని అంచనా వేసి, ఎంత మేర ఆయకట్టుకు సాగునీరు అందించగలమనే అంశంపై త్వరలో స్పష్టమైన ప్రకటన చేస్తామని తెలిపారు.

ఇదే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం పంపులు ఆన్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వడం లేదంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్శలను మంత్రులు ఖండించారు. బ్యారేజీలు లేకుండానే కన్నెపల్లి పంపులు నడపాలని కోరడం అవగాహనలేని వ్యాఖ్యలని పేర్కొన్నారు. నిజంగా పంపుల ద్వారానే నీరు అందించగలిగితే, వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి బ్యారేజీలు ఎందుకు నిర్మించారని ప్రశ్నించారు.
నాలుగేళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 60 టీఎంసీల నీటిని పంపింగ్ ద్వారా ఎల్లంపల్లికి తరలించి, అనంతరం గ్రావిటీ ద్వారా నీరు చేరిన తర్వాత అదే నీటిని గేట్లు ఎత్తి కిందికి వదిలేయడంతో ప్రజాధనం వృథా అయిందని ఆరోపించారు. కేవలం విద్యుత్ బిల్లుల రూపంలోనే సుమారు రూ.3 వేల కోట్ల భారం ప్రజలపై పడిందని విమర్శించారు.మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేయడం మానుకుని వాస్తవాలను గుర్తించాలని మంత్రులు సూచించారు. వేల కోట్లతో నిర్మించిన బ్యారేజీలు మూడేళ్లు కూడా నిలవకుండా దెబ్బతిన్నాయని, ప్రస్తుతం వాటి పరిస్థితిపై ప్రభుత్వం సాంకేతిక పరీక్షలు నిర్వహిస్తూ కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తోందని తెలిపారు.

రైతుల ప్రయోజనాలే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేసిన మంత్రులు, రైతులకు మేలు చేసే నిర్ణయాలనే ప్రభుత్వం తీసుకుంటుందని పేర్కొన్నారు. దక్షిణ తెలంగాణలోని శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు కూడా మరో మూడు నుంచి నాలుగు రోజుల్లో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని, అనంతరం అక్కడి పరిస్థితులపై కూడా స్పష్టత వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

