Breaking News

బోధన్‌లో నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా అరెస్ట్

బోధన్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి).

బోధన్ పట్టణంలోని రాకాసిపేట్‌లో నకిలీ ప్రభుత్వ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు.పోలీసుల వివరాల ప్రకారం.. రాకాసిపేట్ పెద్ద మసీదు సమీపంలోని సహారా మీ సేవ కేంద్రంలో నకిలీ ప్రభుత్వ ధ్రువపత్రాలు తయారు చేస్తున్నారనే సమాచారం అందడంతో CCS ACP శ్రీశైలం ఆధ్వర్యంలో CCS, బోధన్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మీ సేవ ఆపరేటర్ షేక్ వసీమ్ (32), కేంద్రం యజమాని మహమ్మద్ ముక్రమ్ (36)లను అదుపులోకి తీసుకున్నారు.

గత రెండేళ్లుగా నిందితులు నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, జనన ధృవీకరణ పత్రాలు, టీసీలు, బోనఫైడ్ సర్టిఫికెట్లు తదితరాలను తయారు చేసి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపారు. నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగించి కొందరు ప్రభుత్వ పథకాల ద్వారా అక్రమంగా లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు పేర్కొన్నారు.

భారీగా నకిలీ పత్రాలు స్వాధీనం

పోలీసులు తనిఖీల్లో 5 నకిలీ మీ సేవ సర్టిఫికెట్లు, ఇప్పటికే తయారు చేసి ఇచ్చిన 22 నకిలీ జనన ధృవీకరణ పత్రాల జిరాక్స్ కాపీలు, 38 ఖాళీ మీ సేవ ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక రబ్బర్ స్టాంప్, 13 నకిలీ టీసీ–బోనఫైడ్ సర్టిఫికెట్లు, షాదీ ముబారక్‌కు సంబంధించిన ఒక నకిలీ జిరాక్స్ కాపీని స్వాధీనం చేసుకున్నారు.అలాగే నకిలీ సర్టిఫికెట్ల తయారీకి ఉపయోగించిన ఒక HP ల్యాప్‌టాప్, ఒక Canon కలర్ ప్రింటర్, రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పరారీలో ఉన్న ఇతర నిందితులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరించిన CCS, బోధన్ ACP, బోధన్ టౌన్ పోలీస్ సిబ్బందిని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ అభినందించారు. ఈ కేసులో ఇన్‌స్పెక్టర్లు అజయ్, వెంకట నారాయణ, ఎస్‌ఐలు శ్రీనివాస్, ఎల్. రామ్‌తో పాటు CCS, బోధన్ టౌన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *