Breaking News

ఆగస్టు 15 వరకు నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక నిబంధనలు అమలు

విగ్రహాల ప్రతిష్ఠాపన, డీజేలు, ఊరేగింపులు, డ్రోన్ల వినియోగంపై ఆంక్షలు

నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య

నిజామాబాద్, ఆగస్టు 1: (E6 tv NEWS).

ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజా ప్రశాంతతను కాపాడేందుకు నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆగస్టు 1 నుంచి 15వ తేదీ వరకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉంటాయని పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ తెలిపారు. ఈ మేరకు నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలోని పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలు, ఎస్‌ఐలకు అధికార ఉత్తర్వులు జారీ చేసినట్లు వెల్లడించారు.ప్రజలకు ఇబ్బంది కలిగించే ప్రదేశాల్లో విగ్రహాల ప్రతిష్ఠాపన నిషేధమని, విగ్రహాల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలోని కమిటీ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు డీజే సౌండ్ సిస్టమ్‌ల వినియోగం పూర్తిగా నిషేధమని, శబ్ద కాలుష్య నియంత్రణ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఊరేగింపులు, బహిరంగ సభలు నిర్వహించేందుకు ముందస్తు పోలీసు అనుమతి తప్పనిసరి అని, 500 మందికి పైగా హాజరయ్యే కార్యక్రమాలకు 72 గంటల ముందే పోలీస్ కమిషనర్ అనుమతి తీసుకోవాలని తెలిపారు. అలాగే మాల్స్, థియేటర్లు, హోటళ్లు, ఎగ్జిబిషన్‌లు, వ్యాపార సంస్థల్లో భద్రతా ప్రమాణాలు, క్యూ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు.

డ్రోన్ల వినియోగానికి సంబంధిత ప్రభుత్వ శాఖలు, పోలీసు, ఏవియేషన్ అధికారుల ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు. నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తుల సమాచారం వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు అందించాలని సూచించారు.

అలాగే ‘ఎ’ సర్టిఫికెట్ పొందిన సినిమాలను మైనర్లకు ప్రదర్శించరాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి నిబంధనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *