ఎర్గట్ల, సెప్టెంబర్ 6:(E6tv NEWS: ప్రతినిధి).
డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ఏరుగట్ల ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఉపేందర్ రెడ్డి, ఉప సర్పంచ్ లక్ష్మీతో పాటు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు హాజరై ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సర్పంచ్ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు జాతి నిర్మాతలని అన్నారు. తల్లిదండ్రుల తర్వాత గురువులకు సమాజంలో అత్యంత గౌరవప్రదమైన స్థానం ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయులను గౌరవించే వారు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. విద్యార్థులు ఉపాధ్యాయులు సూచించే మంచి విషయాలను పాటిస్తూ, క్రమశిక్షణతో విద్యను అభ్యసించి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.సభాధ్యక్షత వహించిన పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణచారి మాట్లాడుతూ గురువులను గౌరవించడం అనాదిగా వస్తున్న గొప్ప సంస్కృతి అని అన్నారు. ప్రతి విద్యార్థి ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉపాధ్యాయుల ఆశీస్సులు పొందాలని సూచించారు. గురువుల మాటలను గౌరవించి, వారి సూచనలు పాటించే విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదుగుతారని పేర్కొన్నారు.
అనంతరం గ్రామ సర్పంచ్, గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో పాఠశాల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మునీరుద్దీన్, ప్రసాద్, విజయ్, రాజనర్సయ్య, రాజేందర్, గంగాధర్, ప్రవీణ్ శర్మ, ట్వింకిల్, గంగా మోహన్, జ్యోతి, సమత, సబిత, కృష్ణవేణి, శ్యామల, రిషికతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.



