మారుమూల గ్రామాల్లో ధాన్యం నిల్వకు ఉపయోగకరం – సర్పంచులు, తండా పెద్దమనుషులు
మానాల, ఆగస్టు 28:(E6tv NEWS: ప్రతినిధి).
ఉమ్మడి మానాల గ్రామపంచాయతీ పరిధిలోని స్కూల్ తండా గ్రామపంచాయతీలో రూ.30 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఐకేపీ గోడౌన్‌కు భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఉమ్మడి మానాల పరిధిలోని వివిధ గ్రామాల సర్పంచులు, తండా పెద్దమనుషులు, ప్రజాప్రతినిధులు కలిసి భూమిపూజలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మారుమూల ప్రాంతాల్లో గోడౌన్ల నిర్మాణం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పేరుకుపోయిన సమయంలో గోడౌన్లు అందుబాటులో లేకపోవడం వల్ల ధాన్యం తరలింపులో ఆలస్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకుని గ్రామపంచాయతీల్లో గోడౌన్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు.
తొమ్మిది గ్రామపంచాయతీల్లో గోడౌన్ల నిర్మాణం
ఉమ్మడి మానాల గ్రామపంచాయతీ పరిధిలోని తొమ్మిది గ్రామపంచాయతీల్లో గోడౌన్ల నిర్మాణానికి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే అడ్డగోర్ తండా, జ్యాగవత్ తండా, వీరున్ తండా, చింతమన్ తండా, స్కూల్ తండా, సర్పంచ్ తండా, మానాల తదితర గ్రామపంచాయతీల్లో రూ.30 లక్షల చొప్పున గోడౌన్ల నిర్మాణానికి నిధులు కేటాయించినట్లు పేర్కొన్నారు. మిగిలిన గ్రామాల్లోనూ గోడౌన్లకు మంజూరు చేయించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ గోడౌన్లను ధాన్యం నిల్వ చేయడంతో పాటు రబీ సీజన్‌లో ఎరువులు, విత్తనాల నిల్వకు కూడా వినియోగించుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
అభివృద్ధి పనులకు పార్టీలకతీతంగా ప్రాధాన్యం
ప్రభుత్వ నిధులతో ఉమ్మడి మానాల పరిధిలోని తొమ్మిది గ్రామాల్లో అవసరమైన అన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టేందుకు కృషి చేస్తామని తెలిపారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు.
జనవరిలోగా పనులు పూర్తి చేయాలి
గోడౌన్ నిర్మాణ పనులను ఆరు నెలల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సర్పంచులకు సూచించారు. జనవరి నాటికి పనులు పూర్తిచేస్తే మార్చిలో కొత్త నిధులు తీసుకువచ్చి మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.కాంట్రాక్టర్లతో సమన్వయం చేసుకుంటూ సర్పంచులు పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత సమయంలో నిర్మాణాలను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.ఈ సందర్భంగా గోడౌన్ల నిర్మాణానికి సహకరించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్కు సర్పంచులు, గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలిపారు.



