సలీం ఫారం పరిధిలో ప్రభుత్వ భూమి ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాల ఆరోపణలు
రెవెన్యూ, ఇరిగేషన్ అధికారుల దృష్టికి వ్యవహారంభూమి రికార్డులు, వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు
వాస్తవ పరిస్థితులపై వివరాలు సేకరిస్తున్న అధికారులు
క్షేత్రస్థాయి సర్వేతోనే అసలు వాస్తవాలు తేలే అవకాశం
సలీం ఫారం,నవీపేట, సెప్టెంబర్ 3 :(E6tv NEWS ప్రత్యేక కథనం-శివ ఠాకూర్).
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని సలీం ఫారం గ్రామ పరిధిలో ప్రభుత్వ భూమిపై ఆక్రమణలు, అక్రమ క్రయవిక్రయాలు జరుగుతున్నాయనే ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 555,555/1కు సంబంధించిన భూమిలో కొందరు అక్రమంగా ఆక్రమణలకు పాల్పడి, ఇతరులకు విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.ప్రభుత్వ భూమిగా పేర్కొంటున్న సదరు స్థలంలో కొందరు తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారం రెవెన్యూ అధికారుల దృష్టికి వెళ్లింది. అయితే సర్వే నంబర్ 555, 555/1లోని భూమి వాస్తవంగా ఏ కేటగిరీకి చెందింది? ప్రభుత్వ రికార్డుల్లో దాని స్వరూపం ఏమిటి? శిఖం భూమికి సంబంధించిన అంశాలున్నాయా? అన్న విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సంబంధిత భూమి రికార్డులను పరిశీలించడంతో పాటు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహిస్తేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని మండల మెజిస్ట్రేట్, ఇరిగేషన్ ఏఈ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.భూమికి సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి, రెవెన్యూ రికార్డులను పరిశీలించిన అనంతరం స్పష్టమైన వివరాలు వెల్లడిస్తామని తహసీల్దార్ తెలిపారు.
ప్రభుత్వ భూమిపై నిజంగానే ఆక్రమణలు జరిగాయా? అక్రమ క్రయవిక్రయాలు జరిగాయా? సర్వే నంబర్ 555, 555/1 భూమి ఏ కేటగిరీకి చెందింది? భూమిపై చట్టబద్ధమైన హక్కులు ఎవరివి? అనే ప్రశ్నలకు అధికారుల సమగ్ర విచారణతోనే సమాధానం లభించనుంది.ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉంది. ఆరోపణలు వాస్తవమని విచారణలో తేలితే సంబంధిత వ్యక్తులపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం అధికారులు రికార్డులు, ఇతర వివరాలను సేకరిస్తుండటంతో పూర్తి స్థాయి విచారణ అనంతరం వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ఆరోపణలపై అధికారిక విచారణ పూర్తయ్యే వరకు వీటిని ఆరోపణలుగానే పరిగణించాలి. E6TV NEWS ఈ అంశంపై ఫాలోఅప్ కొనసాగిస్తుంది.

