రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ
ఇందూరు, ఆగస్టు 4: E6 tv NEWS ప్రతినిధి.
నిజామాబాద్ నగర బస్ స్టాండ్‌ను ఆధునికీకరించి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కోరారు. మంగళవారం హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, నిజామాబాద్ నగరానికి నూతన బస్ స్టాండ్ నిర్మాణం కోసం స్థలం కేటాయించాలని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. కొత్త బస్ స్టాండ్ నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతం ఉన్న బస్ స్టాండ్‌లోనే ప్రయాణికులకు అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని విజ్ఞప్తి చేశారు.ప్రయాణికుల కోసం విశాలమైన వేచియుండే హాలు, బస్సుల రాకపోకల వివరాలను తెలియజేసే డిజిటల్ డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. భద్రతా చర్యల్లో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, తగిన సంఖ్యలో సిబ్బందిని నియమించాలని కోరారు. అదేవిధంగా ప్రైవేటు వాహనాలు, ఆటోరిక్షాల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయం కల్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు.
నిజామాబాద్ బస్ స్టాండ్‌ను ఆధునికీకరిస్తే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందడంతో పాటు ట్రాఫిక్ సమస్యలు కూడా కొంత మేర తగ్గే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

