MBBS సీటు సాధించిన నిరుపేద విద్యార్థినికి రూ.20 వేల ఆర్థిక సహాయం
సూర్యాపేట, సెప్టెంబర్ 11:(E6tv NEWS: ప్రతినిధి)
పేదరికం లక్ష్యానికి అడ్డంకి కాదని, పట్టుదలతో కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని సూర్యాపేట జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ అన్నారు. పెన్‌పహాడ్ మండలం అనంతారం గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని మామిడి ఇందు NEETలో మంచి ర్యాంక్ సాధించి గాంధీ మెడికల్ కాలేజీలో MBBS సీటు పొందడంతో ఆమెకు తన వంతు సహాయంగా రూ.20 వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.
ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి, ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్మీడియట్ చదివిన ఇందు.. ఆర్థిక ఇబ్బందులను, శారీరక వైకల్యాన్ని అధిగమించి పట్టుదలతో చదివి మెడికల్ సీటు సాధించారు. ఆమె తండ్రి అంజయ్య దివ్యాంగుడు కాగా ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక స్కావెంజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి ప్రసన్న దినసరి కూలీగా పనిచేస్తున్నారు.ఇందు విద్యాభ్యాసానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతున్న విషయం సోషల్ మీడియాలో తెలుసుకున్న ఎస్పీ నరసింహ స్పందించి తన కార్యాలయంలో ఆమెకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించిన ఎస్పీ.. చదువును విజయవంతంగా పూర్తి చేసి మంచి వైద్యురాలిగా ఎదిగి పేదలకు సేవలందించాలని ఆకాంక్షించారు. కష్టపడి చదివే విద్యార్థులకు సమాజం అండగా నిలవాలని, భవిష్యత్తులోనూ ఇందుకు అవసరమైన సహాయం అందిస్తానని భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్ రామారావు, పోలీస్ వెల్ఫేర్ ఆర్‌ఎస్‌ఐ సాయిరాం పాల్గొన్నారు.

