ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు సరికాదు
రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి.. వ్యక్తిగత దూషణలకు తావులేదు
ఎంపీ అరవింద్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్
నిజామాబాద్, ఆగస్టు 23: (E6 tv NEWS: శివ ఠాకూర్).
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన అనుచిత వ్యాఖ్యలను నిజామాబాద్ నగర మాజీ మేయర్ సంజయ్ తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగత రూపురేఖలపై వ్యాఖ్యలు చేయడం రాజకీయ సంస్కారానికి విరుద్ధమని ఆయన అన్నారు.ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు పాలన, విధానాలు, ప్రజా సమస్యలపై ఉండాలని, వ్యక్తిగత విమర్శలు, బాడీ షేమింగ్‌కు దిగడం సరికాదని సంజయ్ పేర్కొన్నారు. ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటి భాషను ఉపయోగించడం సమర్థనీయం కాదని అన్నారు.
“ప్రజల మద్దతుతో గెలిచిన నాయకుడు రేవంత్ రెడ్డి”
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన నాయకుడని సంజయ్ అన్నారు. వ్యక్తిగత విమర్శలు, అడ్డగోలు వ్యాఖ్యలతో ఆయన ప్రతిష్టను తగ్గించలేరని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను చూసి బీజేపీ నేతలు అసహనంతో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.
“నిజామాబాద్ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి”
నిజామాబాద్ ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలపై దృష్టి పెట్టాల్సిన ఎంపీ రాజకీయ విమర్శలకే పరిమితం కావడం సరికాదని సంజయ్ అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు, నియోజకవర్గ అభివృద్ధిపై మాట్లాడాలని సూచించారు.
“భాష మార్చుకోవాలి.. బేషరతుగా క్షమాపణ చెప్పాలి”
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను ఎంపీ అరవింద్ వెంటనే వెనక్కి తీసుకుని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, తెలంగాణ ప్రజలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాజకీయ సంస్కృతిలో వ్యక్తిగత దూషణలకు తావు లేదని అన్నారు.ముఖ్యమంత్రి స్థాయిని కించపరిచేలా ఇకపై వ్యాఖ్యలు చేయకుండా బాధ్యతాయుతమైన భాషను ఉపయోగించాలని ఆయన సూచించారు. రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత గౌరవాన్ని కాపాడుకోవాలని సంజయ్ పేర్కొన్నారు.

