బిచ్కుంద మండలం శాంతాపూర్లో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో నివాళులు
అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన మహనీయుడని కొనియాడిన నాయకులు
బిచ్కుంద, ఆగస్టు1: (E6 tv NEWS, ప్రతినిధి).
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామంలో సాహిత్య రత్న, లోక్ సాహిర్ అన్నా బహు సాటే 106వ జయంతిని ఎంఆర్పీఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఎంఆర్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రుసేగం భూమయ్య మాదిగ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు అన్నా బహు సాటే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రుసేగం భూమయ్య మాదిగ మాట్లాడుతూ, అన్నా బహు సాటే అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహానీయుడని కొనియాడారు. కవి, రచయిత, కళాకారుడిగా దేశ విదేశాల్లో గుర్తింపు పొందిన ఆయన తన సాహిత్యం ద్వారా బడుగు, బలహీన వర్గాల జీవన విధానాన్ని సమాజానికి చాటిచెప్పారని అన్నారు.మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా ఆటేగావ్ గ్రామంలో మాతంగ్ సమాజంలో జన్మించిన అన్నా బహు సాటే, తక్కువ విద్యాభ్యాసం ఉన్నప్పటికీ తన ప్రతిభతో ప్రజా రచయితగా, సామాజిక ఉద్యమకారుడిగా ఎదిగారని పేర్కొన్నారు. కార్మికుల హక్కులు, సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని అన్నారు.
అన్నా బహు సాటే ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన జయంతి వేడుకలను ఈ నెలంతా నిర్వహించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు సాయిలు, పెద్దకొడప్గల్ మండల అధ్యక్షుడు సర్వగల రవీందర్, సీనియర్ నాయకులు మారుతి, ఉపాధ్యక్షుడు బలరాం, మండల సీనియర్ నాయకుడు సాయిలు, మాజీ వార్డు సభ్యుడు హనుమండ్లు, యువజన అధ్యక్షుడు రవి, వీరేశం, మొగులయ్య, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


