జిల్లా వ్యాప్తంగా 1,216 దరఖాస్తులు.. 1,030 మంది అభ్యర్థులు హాజరు
కొత్తగూడెం, సెప్టెంబర్ 7: (E6tv NEWS: ప్రతినిధి).
తెలంగాణ పోలీస్ శాఖలో కానిస్టేబుల్, సబ్-ఇన్‌స్పెక్టర్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ అందించేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1,216 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, 1,030 మంది పరీక్షకు హాజరయ్యారు.అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేసి, పరీక్షను ప్రశాంతంగా, క్రమబద్ధంగా, పారదర్శకంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
ఐదు సబ్-డివిజన్లలో పరీక్షా కేంద్రాలు
జిల్లాలోని ఐదు సబ్-డివిజన్ల పరిధిలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కొత్తగూడెం సబ్-డివిజన్‌లో సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్, పాల్వంచలో అనుబోస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్, ఇల్లందులో గవర్నమెంట్ హై స్కూల్ (జేబీఎస్), మణుగూరులో శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్, భద్రాచలంలో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో పరీక్షలు నిర్వహించారు.
పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఎస్పీ
జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ కొత్తగూడెంలోని సింగరేణి ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ పరీక్షా కేంద్రాన్ని సందర్శించి పరీక్ష నిర్వహణను పరిశీలించారు. అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి, పరీక్షా ప్రక్రియ సజావుగా జరిగేలా అధికారులకు పలు సూచనలు చేశారు.
ప్రతిభ కనబరిచిన వారికి సమగ్ర శిక్షణ
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఉన్న యువతకు సరైన మార్గదర్శకత్వం, నాణ్యమైన శిక్షణ అందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.స్క్రీనింగ్ టెస్ట్‌లో ప్రతిభ కనబరిచిన అర్హులైన అభ్యర్థులకు కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామక పరీక్షలకు అవసరమైన రాత పరీక్షతో పాటు శారీరక దారుఢ్య పరీక్షలకు సమగ్ర శిక్షణ అందిస్తామని చెప్పారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర సాధనతో యువత తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించగలరని పేర్కొన్నారు.


స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహణలో సబ్-డివిజన్ పోలీస్ అధికారులు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొని పరీక్షా ప్రక్రియను విజయవంతంగా నిర్వహించారు.

