Breaking News

కాంగ్రెస్ వైఫల్యాలపై బీఆర్ఎస్ సమరభేరి

నిజామాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ

నిజామాబాద్, సెప్టెంబర్ 5,:(E6tv NEWS: ప్రతినిధి) 

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ నాయకత్వం వహించారు. ర్యాలీలో వెయ్యికి పైగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.పాత కలెక్టర్ గ్రౌండ్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ఫూలాంగ్ ఎక్స్ రోడ్, వర్ని ఎక్స్ రోడ్, ఖిల్లా ఎక్స్ రోడ్, పవన్ టాకీస్ రోడ్, నెహ్రూ పార్క్, బస్ స్టాండ్ మీదుగా సాగి తిరిగి పాత కలెక్టర్ గ్రౌండ్ వద్ద ముగిసింది.

ఈ సందర్భంగా బిగాల గణేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఆరు గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలు పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ వంటి హామీల అమలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ యువతకు వెంటనే స్పష్టమైన భరోసా కల్పించాలని కోరారు. మహిళలు, రైతులు, నిరుద్యోగుల సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలు కొనసాగుతాయని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు ప్రస్తుత పాలనతో పోల్చి చూస్తున్నారని బిగాల గణేష్ పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు, పెండింగ్ హామీలను వెంటనే అమలు చేయకపోతే ప్రజల పక్షాన ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

కార్యక్రమంలో మాజీ మేయర్ దండు నీతు కిరణ్ శేఖర్, నగర అధ్యక్షుడు సిర్ప రాజు, మాజీ NUDA చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, సత్య ప్రకాష్, సుజిత్ సింగ్, నవీద్ ఇక్బాల్, జగత్ రెడ్డితో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *