Breaking News

రైతుల ప్రయోజనాలే పరమావధిగా.. సాగునీటి ప్రాజెక్టులపై జుక్కల్ ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి

లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులపై సమగ్ర సమీక్ష.. జాప్యానికి కారణాలు తెలుసుకుని, అడ్డంకులు తొలగించాలని ఆదేశం

జుక్కల్, సెప్టెంబర్ 2:(E6tv NEWS: ప్రతినిధి)

రైతులకు సాగునీరు అందించడమే లక్ష్యంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించారు. మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖల ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కీలక సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జుక్కల్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న లెండి, నాగమడుగు ప్రాజెక్టు పనులతో పాటు ఇతర నీటివనరుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుల పనుల్లో జరుగుతున్న జాప్యానికి గల కారణాలను అధికారులతో లోతుగా విశ్లేషించారు. పనులు ఆలస్యం కావడానికి కారణమవుతున్న అడ్డంకులను గుర్తించి, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులకు సూచించారు.

రైతన్నల సాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టు పనులను ఎలాంటి అలసత్వానికి తావులేకుండా యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆదేశించారు.సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే నియోజకవర్గంలోని రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, వ్యవసాయానికి భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతన్నల పొలాలకు సాగునీరు అందించి, వారి ముఖాల్లో చిరునవ్వులు చూడటమే లక్ష్యంగా నిరంతరం ప్రజాసేవలో ముందుకు సాగుతున్నామని ఆయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *