Breaking News

కళ్యాణలక్ష్మి పథకాన్ని కొనసాగించాలి: వేముల ప్రశాంత్ రెడ్డి

వేల్పూర్, ఆగస్టు 17: (E6tv NEWS,T. గంగాధర్)

కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను యథావిధిగా కొనసాగించాలని, ఎన్నికల హామీ మేరకు కళ్యాణలక్ష్మి ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం అందించాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణలక్ష్మి పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ వేల్పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం మహిళలతో కలిసి ప్రజల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహశీల్దార్‌కు అందజేశారు.

కేసీఆర్ ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల వివాహ భారాన్ని తగ్గించేందుకు కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను అమలు చేసిందని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డలకు దాదాపు రూ.13 వేల కోట్ల ఆర్థిక సహాయం అందించామని పేర్కొన్నారు. కళ్యాణలక్ష్మి సాయాన్ని దశలవారీగా పెంచి రూ.1,00,116కు చేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనన్నారు.కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో కళ్యాణలక్ష్మి సాయంతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించిందని విమర్శించారు. కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేయకుండా కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కొనసాగిస్తామని ప్రభుత్వం కోర్టులో స్పష్టమైన అఫిడవిట్ దాఖలు చేయాలని డిమాండ్ చేశారు.

బాల్కొండ నియోజకవర్గంలో సుమారు 5 వేల మంది ఆడబిడ్డలకు తులం బంగారం బకాయి ఉందని వేముల తెలిపారు. గత ప్రభుత్వ కాలంలో పెండింగ్‌లో ఉన్న సుమారు 500 మంది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత పొందిన మరో 4,500 మందితో కలిపి దాదాపు 5,000 మంది లబ్ధిదారులకు తులం బంగారం ఇవ్వాల్సి ఉందన్నారు. ఒక్కొక్కరికి తులం చొప్పున సుమారు 50 కిలోల బంగారం అవసరమవుతుందని పేర్కొన్నారు.కాంగ్రెస్ ఎన్నికల హామీలైన మహిళలకు నెలకు రూ.2,500, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆసరా పెన్షన్ రూ.4,000, రైతులకు ఎకరానికి రూ.15 వేల రైతు భరోసా, రూ.2 లక్షల రుణమాఫీ తదితర హామీలను అమలు చేయాలని వేముల డిమాండ్ చేశారు. కొత్తగా అర్హత పొందిన వృద్ధులు, బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు.

కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్లు, కంటి వెలుగు వంటి పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని వేముల ఆరోపించారు. రైతులకు రుణమాఫీ, రైతు భరోసా పూర్తిస్థాయిలో అమలు చేయడంతో పాటు సకాలంలో ఎరువులు, నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు.కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో పూర్తిగా విఫలమైందని, ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్ స్టేషన్లలో అధికార పార్టీ నాయకులు, పైరవీకారుల జోక్యం పెరిగిందని వేముల ఆరోపించారు. ఇసుక, మొరం, గుట్టలు వంటి సహజ వనరుల దుర్వినియోగం జరుగుతోందని విమర్శించారు. ప్రభుత్వం ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యతను విస్మరించకూడదన్నారు.

కళ్యాణలక్ష్మి, తులం బంగారం వంటి హామీల అమలు కోసం ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. పేదల హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని, ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వేముల ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *