ఏర్గట్లలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు
ప్రశాంత్ రెడ్డి హయాంలో నాణ్యత లేని నిర్మాణాలు జరిగాయని విమర్శ
ప్రజా ప్రభుత్వంలో అర్హులకు 500 ఇళ్ల మంజూరు జరిగిందని వెల్లడి
మరో 500 ఇళ్లను మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ
ఏర్గట్ల, ఆగస్టు 6: (E6 tv NEWS, ప్రతినిధి).
ఏర్గట్ల మండల కేంద్రంలోని డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను గురువారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్గట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శివన్నోల్ల శివకుమార్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు పేదలకు పంపిణీ చేయాలనే ఉద్దేశంతో కాకుండా కేవలం కమిషన్ల కోసమే చేపట్టారని ఆరోపించారు.
మాజీ గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి తన పదవీకాలంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. కాంట్రాక్టర్కు 95 శాతం బిల్లులు చెల్లించినప్పటికీ పనులు అసంపూర్తిగా వదిలేయడంతో పాటు నాణ్యత లోపించిన నిర్మాణాలు జరిగాయని ఆరోపించారు.30 నెలల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల అవసరాలను పట్టించుకోకుండా పనులను మధ్యలోనే నిలిపివేసిందని, ఇప్పుడు అదే అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించడం సమంజసం కాదని శివకుమార్ పేర్కొన్నారు.
ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం గడిచిన 30 నెలల్లోనే ఏర్గట్ల మండల పరిధిలో సుమారు 500 మంది అర్హులకు ఇళ్లను మంజూరు చేసి, ఒక్కో ఇంటికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించిందని తెలిపారు. వీటిలో ఇప్పటికే సగం ఇళ్లు పూర్తై లబ్ధిదారులు నివాసం ఉంటుండగా, మిగిలిన ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు.అర్హత కలిగిన మిగిలిన లబ్ధిదారుల కోసం మరో 500కు పైగా ఇళ్లను కూడా త్వరలో మంజూరు చేయనున్నట్లు వెల్లడించారు. పేదల సంక్షేమం, గృహ కల్పన కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సోమ దేవారెడ్డి, సర్పంచులు, ఉపసర్పంచులు, డైరెక్టర్లు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


