ప్రజల్లో పోషకాహారంపై విస్తృత అవగాహన కల్పించాలి: డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్
నేత్రదానం ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, సెప్టెంబర్ 7 :(E6tv NEWS: ప్రతినిధి).
పోషకాహార వారోత్సవం సందర్భంగా ప్రజలకు సమతుల ఆహారం, పోషకాహారం, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై విస్తృతంగా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా. తుకారామ్ రాథోడ్ వైద్య సిబ్బందికి సూచించారు.సోమవారం రామవరం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (యూపీహెచ్‌సీ)ను డీఎంహెచ్‌ఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, సిబ్బంది హాజరు, ప్రజలకు అందుతున్న ఆరోగ్య సేవలను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడి ఆసుపత్రి ద్వారా అందుతున్న సేవల వివరాలను తెలుసుకున్నారు.
పోషకాహార వారోత్సవాల సందర్భంగా ప్రతి కుటుంబానికి సమతుల ఆహారం ప్రాధాన్యతను తెలియజేయాలని సూచించారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు, పండ్లు, పప్పుధాన్యాలు, చిరుధాన్యాలు, పాలు తదితర పోషక పదార్థాలను తగిన మోతాదులో తీసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు, కిశోర బాలికలు, వృద్ధులు పోషకాహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
నేత్రదానంపై అవగాహన పెంచాలి
నేత్రదాన అవగాహన పక్షోత్సవం (ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 8 వరకు)లో భాగంగా నిర్వహించిన రేడియో టాక్ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ డా. తుకారామ్ రాథోడ్ పాల్గొని ప్రజలకు నేత్రదానంపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మరణానంతరం నేత్రదానం చేయడం ద్వారా కార్నియా సమస్యల కారణంగా చూపును కోల్పోయిన ఇద్దరు వ్యక్తులకు చూపును అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. నేత్రదానం గొప్ప సామాజిక సేవగా అభివర్ణించారు. ఒక వ్యక్తి మరణించిన తర్వాత కూడా అతని కళ్ల ద్వారా మరొకరి జీవితంలో వెలుగులు నింపవచ్చని పేర్కొన్నారు.నేత్రదానంపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వాస్తవాలను తెలియజేయాలని సూచించారు. కుటుంబ సభ్యులు తమ బంధువుల నేత్రదానానికి సంబంధించి ముందుగానే అవగాహన, సమ్మతి కలిగి ఉండటం ముఖ్యమన్నారు. నేత్రదానంపై మరింత సమాచారం కోసం సమీపంలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలు, నేత్ర వైద్య నిపుణులను సంప్రదించాలని సూచించారు.
“మరణానంతరం మన కళ్లను దానం చేయడం ద్వారా మరొకరి జీవితంలో వెలుగును నింపవచ్చు. ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకుని, నేత్రదానానికి ముందుకు రావాలి” అని డీఎంహెచ్‌ఓ ప్రజలకు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమాల్లో వైద్య అధికారులు, వైద్య సిబ్బంది, ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



