విద్యార్థి దశ నుంచే సైబర్ భద్రతపై అవగాహన అవసరం: సీఐ చరమంద రాజు
ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచన
మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి బాధ్యతగల పౌరులుగా ఎదగాలని పిలుపు
హుజూర్‌నగర్, ఆగస్టు 5: (E6 tv NEWS ప్రతినిధి)
విద్యార్థి దశ నుంచే సాంకేతికత వినియోగంతో పాటు సైబర్ భద్రతపై అవగాహన కలిగి ఉండటం అత్యంత అవసరమని హుజూర్‌నగర్ సీఐ చరమంద రాజు అన్నారు. బుధవారం హుజూర్‌నగర్ పట్టణంలోని గ్రీన్‌వుడ్ స్కూల్‌లో సైబర్ నేరాల నియంత్రణ, మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్సై నరేష్‌తో కలిసి సీఐ చరమంద రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాంకేతికత విస్తరిస్తున్న కొద్దీ సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఆన్‌లైన్ మోసాలు, సోషల్ మీడియా వేదికగా జరిగే నేరాల పట్ల విద్యార్థులు, యువత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింక్‌లను నమ్మవద్దని, అలాంటి ఘటనలు ఎదురైతే వెంటనే ఉపాధ్యాయులు లేదా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

అదేవిధంగా మాదకద్రవ్యాల వ్యసనం యువత భవిష్యత్తును నాశనం చేస్తుందని హెచ్చరించారు. చిన్న వయసులోనే చెడు అలవాట్లకు బానిస కాకుండా విద్య, క్రమశిక్షణ, మంచి విలువలతో ఎదగాలని విద్యార్థులకు సూచించారు. ఎక్కడైనా మత్తు పదార్థాల విక్రయాలు జరిగినా లేదా అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించి బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.



