జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
బంజారాహిల్స్, హైదరాబాద్, ఆగస్టు 15: (E6 tv NEWS: ప్రతినిధి)
బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
బ్రిటీష్ కాలం నాటి ఆలోచన విధానాలను వీడాలి
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బ్రిటీష్ పాలన ముగిసినా, ఆ కాలం నాటి ఆలోచనా విధానాలను ఇప్పటికీ అనుసరించడం సరికాదన్నారు. బ్రిటీష్ పాలనలో జరిగిన దోపిడీ, అణచివేత, విభజించి పాలించిన విధానాలను నేటి తరానికి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.
మన చరిత్రను మనం తెలుసుకోవాలి
మన చరిత్రను మనం తెలుసుకోవాలని, మన పూర్వీకులు చేసిన పోరాటాలను పిల్లలకు వివరించాలని కవిత సూచించారు. చరిత్రను పూర్తిగా తెలుసుకున్న వారే భవిష్యత్‌ను చక్కగా నిర్మించగలరని అన్నారు.
బ్రిటీష్ పాలనలో ఎన్నో అన్యాయాలు జరిగాయి
జలియన్ బాగ్ ఘటనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని, కృత్రిమంగా కరువులను సృష్టించడం ద్వారా అనేక మంది మరణాలకు బ్రిటీష్ పాలన కారణమైందని కవిత పేర్కొన్నారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో భారతీయులను సైనికులుగా వినియోగించుకుని ఎంతోమంది ప్రాణాలు కోల్పోయేలా చేశారని ఆరోపించారు.
విభజించి పాలించిన విధానం వల్ల నష్టం
బ్రిటీష్ పాలనలో విభజించి పాలించిన విధానం అమలు చేశారని కవిత అన్నారు. దేశాన్ని విడిచిపోతూ భారత్, పాకిస్థాన్‌గా విభజించడం ద్వారా శాశ్వత వైరాలకు బీజం వేశారని పేర్కొన్నారు. ఆదివాసీలను కూడా బ్రిటీష్ పాలనా పరిధిలోకి తీసుకువచ్చి అన్యాయం చేశారని అన్నారు.

కోహినూర్ సహా సంపదను తిరిగి ఇవ్వాలి
బ్రిటీష్ పాలనలో భారతదేశంతో పాటు ఇతర దేశాల సంపదను దోచుకున్నారని కవిత ఆరోపించారు. భారతదేశం నుంచి తీసుకెళ్లిన కోహినూర్ వజ్రంతో పాటు ఇతర సంపదను తిరిగి ఇవ్వాలని తెలంగాణ రక్షణ సేన డిమాండ్ చేస్తోందన్నారు.
మాతృభాషకు గౌరవం ఇవ్వాలి
ఇంగ్లీష్ మాట్లాడేవారే గొప్పవారనే భావనను విడనాడాలని కవిత అన్నారు. మన భాషలో మాట్లాడేవారిని తక్కువగా చూడటం సరికాదన్నారు. తెల్లని చర్మం గొప్పది, నల్లని చర్మం తక్కువ అనే భావనలను కూడా బ్రిటీష్ ఆలోచనా విధానంలో భాగంగా పేర్కొన్నారు.

పిల్లలకు స్వాతంత్ర్య పోరాట చరిత్రను తెలియజేయాలి
ఆనాటి బ్రిటీష్ పరిపాలన, ఆలోచనా విధానాలను వీడి మన దేశ చరిత్ర, సంస్కృతి, పూర్వీకుల పోరాటాలను గౌరవించాలన్నారు. భవిష్యత్ తరాలకు స్వాతంత్ర్య పోరాట చరిత్రను తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కవిత పేర్కొన్నారు.



