శిల్పినగర్, కేజీబీవీ విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం
భద్రాచలం ఎంఈఓ బెక్కంటి శ్రీనివాసరావు
భద్రాచలం, సెప్టెంబర్ 10:(E6tv NEWS: ప్రతినిధి).
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన అన్ని వసతులు కల్పిస్తూ విద్యార్థి కేంద్రంగా బోధన అందిస్తున్నామని భద్రాచలం మండల విద్యాశాఖ అధికారి బెక్కంటి శ్రీనివాసరావు అన్నారు. శిల్పినగర్ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ భద్రాచలం విద్యార్థులు చురుకుగా, ఉత్సాహంగా విద్యను అభ్యసిస్తూ ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులతో పోటీకి తాము సైతం సిద్ధమంటున్నారని తెలిపారు.
గురువారం భద్రాచలం పట్టణంలోని శిల్పినగర్ ప్రాథమిక పాఠశాల, కేజీబీవీ పాఠశాలలను ఎంఈఓ సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలల్లో విద్యాబోధన, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, మౌలిక వసతులను పరిశీలించారు.ఉపాధ్యాయులు వివిధ శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటూ విద్యార్థి కేంద్రంగా బోధనా పద్ధతులను అమలు చేస్తున్నారని ఎంఈఓ తెలిపారు. విద్యార్థులకు సమగ్ర బోధన అందించడంతో వారిలో ఆత్మవిశ్వాసం పెరిగి, ఏ పోటీకైనా సిద్ధంగా ఉన్నామనే భావన ఏర్పడిందన్నారు.
పాఠశాలల్లో పచ్చదనం, పరిశుభ్రత, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నిర్వహణ, ఎఫ్‌ఎల్‌ఎన్ కార్యక్రమాలు, రెమిడియల్ తరగతులు, బేస్‌లైన్ పరీక్షలు సంతృప్తికరంగా నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఉపాధ్యాయుల కృషిని ఎంఈఓ అభినందించారు.ప్రాథమిక స్థాయి విద్యార్థులకు ఎఫ్‌ఎల్‌ఎన్, 6, 7 తరగతుల విద్యార్థులకు లిప్ కార్యక్రమంలో భాగంగా బేస్‌లైన్ పరీక్షలు నిర్వహిస్తూ, సాయంత్రం ప్రత్యేక తరగతుల ద్వారా కనీస అభ్యసన సామర్థ్యాలను పెంపొందిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో పాఠశాల రిసోర్స్ పర్సన్ టి. రామకృష్ణ, ప్రధానోపాధ్యాయిని కృష్ణకుమారి, ఉపాధ్యాయిని స్రవంతి, స్వచ్ఛమిత్ర సేవకురాలు, మధ్యాహ్న భోజన నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.




