Breaking News

బాల్కొండలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలి

నియోజకవర్గ కేంద్రాన్ని కాదని మారుమూల గ్రామాన్ని ఎలా ఎంపిక చేస్తారు?

జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో వినతిపత్రం సమర్పించిన మన హక్కుల కౌన్సిల్ ప్రతినిధులు

బాల్కొండ, ఆగస్టు 31:(E6tv NEWS:ప్రతినిధి).
బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరుతూ మన హక్కుల కౌన్సిల్ సామాజిక, సాంస్కృతిక విభాగం ప్రతినిధులు జిల్లా కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కౌన్సిల్ ప్రతినిధులు సమాచార హక్కు చట్టం కింద రెండో అప్పీల్‌కు సంబంధించిన వినతిపత్రాన్ని సమర్పించారు.ఈ సందర్భంగా కౌన్సిల్ అధ్యక్షులు బి. నర్సింగ్‌రావు, ఉపాధ్యక్షులు డి. పవన్‌కుమార్ మాట్లాడుతూ.. బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయడంలో జరుగుతున్న జాప్యంపై పూర్తి సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై గతంలో జూలై 6న జిల్లా విద్యాశాఖకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదని తెలిపారు. దీంతో సమాచార హక్కు కమిషన్‌ను కూడా ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.

నియోజకవర్గ కేంద్రంలోనే ఏర్పాటు చేయాలి

తెలంగాణ పబ్లిక్ స్కూల్ కోసం బాల్కొండ నియోజకవర్గ కేంద్రానికి బదులుగా సరైన రవాణా, ఇతర మౌలిక సదుపాయాలు లేని మారుమూల గ్రామాన్ని ఎంపిక చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల బాల్కొండ ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవడమే కాకుండా ప్రభుత్వానికి కూడా చెడ్డపేరు వచ్చే అవకాశం ఉందని వినతిపత్రంలో పేర్కొన్నారు.ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అవసరమైన వసతులు ఇప్పటికే ఉన్నాయని తెలిపారు. పాఠశాలలో తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలలో కలిపి సుమారు 340 మంది విద్యార్థులు, 22 మంది ఉపాధ్యాయులు, 20 తరగతి గదులు ఉన్నాయని వివరించారు.

నాలుగు ఎకరాల క్రీడా మైదానం

పాఠశాలకు సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో చదును చేసిన క్రీడా మైదానం (మినీ స్టేడియం) అందుబాటులో ఉందని తెలిపారు. అదేవిధంగా సైన్స్, కంప్యూటర్, మ్యాథ్స్ ల్యాబ్‌లతో పాటు ఇతర విద్యా సదుపాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.బాల్కొండ నియోజకవర్గ కేంద్రం జాతీయ రహదారికి ఆనుకొని ఉండటంతో పాటు రవాణా, రోడ్డు సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. నియోజకవర్గ కేంద్రానికి సమీపంలో ముప్కాల్, రేంజర్ల, మోర్తాడ్, కమ్మర్‌పల్లి, ఏర్గట్ల మండలాలు ఉండటంతో ఆయా ప్రాంతాల విద్యార్థులకు కూడా రవాణా సౌకర్యం సులభంగా ఉంటుందని వివరించారు.

ప్రభుత్వ భూమిని కేటాయించాలి

బాల్కొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పడమటి వైపున ఉన్న నకాష్‌గల్లీ పరిసరాల్లో ప్రభుత్వ భూములను గతంలో అధికారులు సర్వే చేసి గుర్తించినట్లు వారు తెలిపారు. 2022 డిసెంబర్ 16, 17 తేదీల్లో అప్పటి ఇన్‌చార్జి తహసీల్దార్ వినోద్‌కుమార్, ప్రభుత్వ సర్వేయర్, అప్పటి వి.డి.సి. సభ్యుల సమక్షంలో సర్వే నిర్వహించినట్లు పేర్కొన్నారు.ఆ భూములను ప్రభుత్వ భూములుగా గుర్తిస్తూ అప్పటి జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు ఆదేశాలు జారీ చేసినట్లు వారు తెలిపారు. ఈ భూములను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌కు కేటాయిస్తే పాఠశాలకు అవసరమైన అదనపు మౌలిక వసతులు, క్రీడా మైదానాలను కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని సూచించారు.

ఇంటిగ్రేటెడ్ స్కూల్‌కు కూడా భూములు అందుబాటులో ఉన్నాయి

బాల్కొండలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మోడల్ స్కూల్ సమీపంలోని ముక్కిడి ఫకీర్, బోదపల్లి గుట్టల పరిసరాల్లో విస్తారమైన ప్రభుత్వ భూములు ఉన్నాయని తెలిపారు.అవసరమైన చోట గుట్టలను చదును చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను ఏర్పాటు చేస్తే బాల్కొండ అసెంబ్లీ నియోజకవర్గానికి మరింత గుర్తింపు లభిస్తుందని వారు పేర్కొన్నారు.తెలంగాణ పబ్లిక్ స్కూల్‌తో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ను కూడా బాల్కొండ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసేలా ప్రభుత్వం, జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *