కేసును నీరుగారిస్తే రాజధాని ముట్టడిస్తాం
కొత్తగూడెం, సెప్టెంబర్ 8:(E6tv NEWS: ప్రతినిధి).
నర్సు ఊకె శిరీష హంతకులను కఠినంగా శిక్షించాలని, కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తే రాజధానిని ముట్టడిస్తామని సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్.కె. సాబీర్ పాషా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శిరీష హత్య ఘటనపై సోమవారం కొత్తగూడెంలోని సిపిఐ కార్యాలయం శేషగిరిభవన్‌లో రాజకీయ, సామాజిక, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సాబీర్ పాషా మాట్లాడుతూ ప్రజాసేవలో ఉన్న గిరిజన యువతిపై ఇంతటి ఘాతుకానికి పాల్పడటం సభ్యసమాజం తలదించుకోవాల్సిన విషయమన్నారు. ఘటనపై ప్రభుత్వం కేవలం కంటితుడుపు చర్యలతో సరిపెట్టడం సరికాదని విమర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కోటి రూపాయల పరిహారం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
మేయర్ మూడ్ గణేష్ మాట్లాడుతూ శిరీష కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు. నిందితులకు కఠిన శిక్ష పడే వరకు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.
ఫాస్ట్‌ట్రాక్ కోర్టుతో విచారణ జరపాలి
మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య మాట్లాడుతూ గిరిజన బిడ్డ శిరీష హత్య సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. కేసు విచారణకు ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి నిందితులకు త్వరితగతిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
మహిళల రక్షణకు పకడ్బందీ చర్యలు
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు కే. బ్రహ్మచారి మాట్లాడుతూ పని ప్రదేశాల్లో మహిళలకు భద్రత కల్పించేలా సమగ్ర మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడంతో పాటు బాధిత కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ జిల్లా నాయకుడు మంద హనుమంతు మాట్లాడుతూ శిరీష కుటుంబానికి జరిగిన అన్యాయంపై ప్రజాస్వామిక శక్తులన్నీ ఐక్యంగా అండగా నిలుస్తాయని తెలిపారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి బాధిత కుటుంబంలో ఒకరికి వెంటనే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు.
టీఆర్ఎస్ జిల్లా నాయకుడు వీరన్న మాట్లాడుతూ మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం, అధికారులు కఠినంగా వ్యవహరించాలని అన్నారు. నిందితులపై ఉక్కుపాదం మోపి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అసెంబ్లీలో శిరీష అంశాన్ని ప్రస్తావిస్తా
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హైదరాబాద్ నుంచి ఫోన్ ద్వారా సమావేశంలో మాట్లాడారు. నర్సు శిరీష హత్య తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా బాధ్యత తీసుకుంటానని, రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. బాధిత కుటుంబానికి తగిన పరిహారంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు.సమావేశంలో న్యూ డెమోక్రసీ నాయకులు గౌని నాగేశ్వరరావు, ఉక్లా, సామాజిక, ప్రజా సంఘాల నాయకులు సలిగంటి శ్రీనివాస్, మున్నా లక్ష్మికుమారి, ఎస్.కె. ఫహీం, చండ్ర అరుణ, ఎం. జ్యోతి, వాసం రామకృష్ణ, మద్దెల శివకుమార్, వర్క అజిత్, హరికృష్ణ, రాంబాబు, రమేష్, అసిఫ్ ఉద్దీన్, రత్నకుమారి, మేదిని లక్ష్మి, బిక్షం, నాగకృష్ణ తదితరులు మాట్లాడారు.
సలిగంటి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా, సామాజిక సంఘాల నాయకులు ఖయ్యూం, లక్ష్మీ, షాహిన్, కైసర్, విష్ణు, సాయి కుమార్, యాకుబ్ షావలి, జాటోత్ కృష్ణ, కల్లూరి కిషోర్, రవి, ముసలం రామకృష్ణ, గోవిందు, అంకుష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

