శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యలు: సీఐ చరమంద రాజు
అసాంఘిక శక్తులు, గంజాయి ముఠాలకు గట్టి హెచ్చరిక
హుజూర్నగర్, సెప్టెంబర్ 5:(E6tv NEWS: ప్రతినిధి)
స్థానిక ముత్యాలమ్మ జాతరను పురస్కరించుకుని హుజూర్నగర్ పట్టణంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా హుజూర్నగర్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చరమంద రాజు, ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు.జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా, ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించుకునేలా పోలీసు శాఖ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా పట్టణంలోని పాత నేరస్థులు, గంజాయి సేవించే వారు, ఘర్షణలకు పాల్పడే ఆకతాయిలు, అసాంఘిక శక్తులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.పండుగ రోజుల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. జాతరను ప్రశాంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు భక్తులు, ఉత్సవ కమిటీ సభ్యులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ చరమంద రాజు స్పష్టం చేశారు.

