Breaking News

కార్పొరేట్ ఆసుపత్రుల్లో జర్నలిస్టులకు హెల్త్ కార్డు వర్తింపజేయాలి

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు వైద్య సదుపాయాలు కల్పించాలి: టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్

నిజామాబాద్ ఆగస్టు 12: (E6 tv NEWS, శివ ఠాకూర్).

ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే జర్నలిస్టులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు కల్పించాలని టీయూడబ్ల్యూజె హెచ్-143 రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతీ సాగర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

బుధవారం జిల్లా కేంద్రంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో టీయూడబ్ల్యూజె హెచ్-143 జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మారుతీ సాగర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టులు క్రియాశీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం రూ.47 కోట్లతో వెల్ఫేర్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం డెస్క్ జర్నలిస్టులకు ప్రత్యేక అక్రిడిటేషన్ కార్డులు జారీ చేసేందుకు జీవో తీసుకురావడాన్ని తాము వ్యతిరేకించామని పేర్కొన్నారు. చిన్న పత్రికలకు అక్రిడిటేషన్ విషయంలో నిబంధనలు విధిస్తే వాటి కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేయడంతో ప్రభుత్వం అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేందుకు ముందుకు వచ్చిందన్నారు.

జర్నలిస్టుల ప్రధాన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన కోరారు. ముఖ్యంగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించడంతో పాటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో హెల్త్ కార్డు ద్వారా వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు.

సమావేశంలో జిల్లా అడహక్ కమిటీ కన్వీనర్‌గా రజినీష్, కో-కన్వీనర్‌గా మోహన్, గౌరవ అధ్యక్షులుగా పప్పఖాన్‌తో పాటు మరో పది మందితో కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రమణ, యోగన్న తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *