Breaking News

సంక్షేమ హాస్టళ్లలో మేస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచాలి

విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలి

మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: ఏఐపీఎస్‌యూ

బోధన్, ఆగస్టు 31:(E6tv NEWS: ప్రతినిధి).

సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం మేస్, కాస్మోటిక్ ఛార్జీలను తక్షణమే పెంచాలని అఖిల భారత ప్రగతిశీల విద్యార్థి సంఘం (AIPSU) డిమాండ్ చేసింది.AIPSU బోధన్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఎస్సీ సంక్షేమ హాస్టల్‌ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIPSU బోధన్ డివిజన్ కార్యదర్శి సునీల్ మాట్లాడుతూ.. నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అందిస్తున్న మేస్, కాస్మోటిక్ ఛార్జీలు సరిపోవడం లేదన్నారు. ఛార్జీలను పెంచి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

విద్యార్థులకు ప్రతి సంవత్సరం పాకెట్ మనీతో పాటు హాస్టళ్ల నిర్వహణ, మౌలిక వసతుల కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యార్థి దశలో పౌష్టికాహారం ఎంతో కీలకమని, సరైన ఆహారం అందితే విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారని పేర్కొన్నారు.అలాగే హాస్టళ్లలో ఫ్యాన్లు, లైట్లు, తాగునీరు, పరిశుభ్రత, ఇతర మౌలిక వసతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

ఈ సందర్భంగా AIPSU రాష్ట్ర కమిటీ సభ్యులు గోపాల్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా పూర్తి స్థాయి విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం దురదృష్టకరమన్నారు. అసెంబ్లీలో విద్యార్థుల సమస్యలను ప్రస్తావించి పరిష్కరించే పరిస్థితి లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఇది విద్యార్థి వ్యతిరేక వైఖరికి నిదర్శనమని పేర్కొన్నారు.కార్యక్రమంలో గణేష్‌తో పాటు AIPSU నాయకులు, హాస్టల్ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *