కామారెడ్డి, ఆగస్టు 14: (E6 tv NEWS: ప్రతినిధి)
హల్ద్వానీలో కాంగ్రెస్ నిర్వహించిన ర్యాలీ ప్రదేశాన్ని గంగాజలంతో శుద్ధి చేసిన ఘటనను నిరసిస్తూ ఆగస్టు 14న కామారెడ్డి జిల్లాలో జిల్లా స్థాయి పాదయాత్ర, సత్యాగ్రహ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ తెలిపారు.
ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేకు సంఘీభావంగా నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లాలోని మండల కాంగ్రెస్ అధ్యక్షులు, డీసీసీ కార్యవర్గ సభ్యులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మహిళా కాంగ్రెస్, అనుబంధ సంఘాలు, విభాగాల నాయకులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.మహాత్మా గాంధీ లేదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద పాదయాత్ర అనంతరం సత్యాగ్రహం నిర్వహించి వివక్ష, అంటరానితనం, రాజ్యాంగ విలువలకు విరుద్ధమైన చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయనున్నట్లు పేర్కొన్నారు.సమానత్వం, సౌభ్రాతృత్వం, సామాజిక న్యాయం, మానవ గౌరవం వంటి రాజ్యాంగ విలువల పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఏలే మల్లికార్జున్ స్పష్టం చేశారు.

